అవును.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. తిరుమల లడ్డూ వివాదం నడుస్తున్న నేపథ్యంలో వెంకన్నను దర్శించుకుని ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడి మరింత క్లారిటీ ఇవ్వాలని జగన్ భావించారు. ఐతే.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలకు పోలీసుల ముందస్తు నోటీసులు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు, డిక్లరేషన్ అంశంపై రచ్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.
ఎందుకు..?
ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చింది..? ఏ పరిస్థితుల్లో రద్దు అయ్యింది..? అనే దానిపై మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వనున్నారు. ఈ మేరకు వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే తాడేపల్లి వేదికగా మీడియా మీట్ నిర్వహించిన జగన్.. లడ్డూ వివాదంపై ఘాటుగానే స్పందించారు. ఇప్పుడు మరోసారి జగన్ మీడియా ముందుకు వస్తున్నారు. ఏం మాట్లాడుతారో..? అధికార కూటమి గురుంచి ఏం మాట్లాడుతారు..? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలపై ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది.
దాడికి కుట్ర!
ఇదిలా ఉంటే.. ఈ పర్యటన రద్దుకు మునుపు జగన్ రెడ్డిపై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో దాడికి భానుప్రకాశ్ రెడ్డి, కిరణ్ రాయల్, టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు సమాచారం. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోందని వైసీపీ ట్వీట్ చేసింది.