ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకూ హీటెక్కుతున్నాయి. టీడీపీ కూటమి.. వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సరిగ్గా కూటమి 100 రోజులు పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఎప్పుడైతే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే మాట సీఎం చంద్రబాబు నోట రావడంతో నెలకొన్న వివాదం ఇప్పటికీ నడుస్తున్నది. ఇందులో నిజానిజాలు, సూత్రధారులు, పాత్రధారులు ఎవరు..? అని రాబట్టేందుకు సిట్ టీంను ఏర్పాటు చేసింది బాబు సర్కార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆయన పాటికి ఆయన ఉంటే.. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడేశారు. దీంతో రగిలిపోయిన జనసైనికులు పేర్ని ఇల్లు ముట్టడించారు.
రచ్చ.. రచ్చ..
భీమవరంలో బాప్టిజం తీసుకున్నారని.. పొరపాట్లు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్తం చేసుకుంటారని పేర్ని నాని మాటలకు జనసైనికులు కన్నెర్ర చేయాల్సి వచ్చింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాని ఇంటి ముందు రచ్చ రచ్చే జరిగింది. డిప్యూటీ సీఎంనే నోటికి వచ్చినట్టు మాట్లాడుతావా..? అంటూ పేర్ని ఇంటి ముందు ధర్నాకు దిగారు. చెప్పుల దొంగ.. పేర్ని నాని అంటూ నినాదాలతో హోరెత్తించారు. నాలుగైదు గంటల పాటు ఇదే పరిస్థితి. పోలీసులు రంగప్రవేశం చేసినా ప్రయోజనం లేకపోయింది. దిష్టిబొమ్మ దగ్దానికి కూడా కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు.. జనసేన కార్యకర్తలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు.
నీకు ఎనిమిదే.. మాకు!
ఈ హడావుడి మధ్యలోనే మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని.. పవన్ పై మరోసారి ఫైర్ అయ్యారు. కేవలం 8% ఓటు షేర్ ఉన్న నువ్వే 50 మందిని పంపిస్తే.. 40% ఓటు షేర్ ఉన్న మేం ఎంత మందిని పంపగలం..? అని డిప్యూటీ సీఎంను హెచ్చరించారు. కబడ్దార్ పవన్.. బందరులో మేము కూడా హింసా రాజకీయం మొదలు పెట్టాలా..? అంటూ తీవ్ర స్థాయిలో పేర్ని మండిపడ్డారు. మా ఇంటికి వాళ్ల (ధర్నా చేయడానికి వచ్చిన నేతలు, కార్యకర్తలు) ఇల్లు ఎంత దూరమో.. వాళ్ల ఇంటికి మా ఇల్లు అంతే దూరమని గుర్తించాలి అని సూచించారు. సినిమా షూటింగ్స్ తరహాలో రాజకీయాల్లో చేయాలంటే సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. పేర్ని కామెంట్లు మరింత అగ్గిని రాజేశాయి. విమర్శలు, కౌంటర్లు వస్తే చాలు గంటల వ్యవధిలో స్పందించే పవన్.. నిన్న, ఇవాళ వైసీపీ నేతల మాటలకు రియాక్ట్ కాలేదు.. పవన్ మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలి మరి.