వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ ఇస్తారా.. ఇవ్వరా..? ఇప్పుడిదే సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు మొదలుకుని యావత్ తెలుగు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తిరుమల లడ్డూ వివాదం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అసలేం జరిగింది..? తన హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని నిరూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి సుమారు అరగంటకు పైగా మాట్లాడిన జగన్.. లడ్డూపై విచారణ జరపాలని, సీఎం చంద్రబాబుకు మొట్టికాయలు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి 8 పేజీల లేఖ కూడా రాశారు. ఇవన్నీ ఇలా నడుస్తుండగానే.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీంతో ఇందుకు పోటీగా ఈ నెల 28న వైసీపీ నేతలు, కార్యకర్తలు దేవాలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు జగన్ కూడా తిరుమల వెంకన్నను దర్శించుకోబోతున్నారు.
తెరమీదకు కొత్త అంశం!
జగన్ తిరుమల దర్శనం నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వాలని ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మరోసారి రచ్చ మొదలైంది. ఇప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న బీజేపీ.. ఈ డిక్లరేషన్ పట్టుకుంది. అంతేకాదు డిక్లరేషన్ ఇవ్వకపోతే అడ్డుకుంటామని కూడా హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు.. అలిపిరి దగ్గరే అడ్డుకుంటామని కూడా కొందరు బీజేపీ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే.. జగన్ అన్యమతస్థుడనీ, హిందువు కాదు కాబట్టి శ్రీవారి దర్శనం కోసం డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
అందరికీ ఒకటేగా..!
వాస్తవానికి.. తిరుమల వెంకన్నను దర్శనానికి.. టీటీడీ సాధారణ నిబంధనలలోని రూల్ నంబర్ 136 కేవలం హిందువులకు మాత్రమే అనుమతి అని ఉంది. ఐతే.. హిందువులు కాకుండా వేరే మతానికి చెందినవారు ఐతే.. తప్పనిసరిగా వారి మతం గురించి టీటీడీ అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఇది సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఉండే రూల్ అంతే. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు. ఇప్పుడు జగన్ రెడ్డి ఇంత హడావుడి మధ్య వెళ్తున్న తరుణంలో డిక్లరేషన్ ఇస్తారా.. లేదా..? ఇస్తే ఏంటి..? ఇవ్వకపోతే ఏం జరుగుతుంది..? అని యావత్ రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తున్న పరిస్థితి. దర్శనం తరవాత కొండ కింద మీడియా మీట్ పెట్టడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గొడవలు కాకుంటే..!
మొత్తానికి చూస్తే.. జగన్ తిరుమల పర్యటన మాత్రం పెద్ద రచ్చగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి తోడు బీజేపీ కానీ.. టీడీపీ కానీ ఏ మాత్రం దాడికి తెగబడినా జగన్ రెడ్డికి ఎక్కడలేని సానుభూతి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అందుకే.. పార్టీలు మొదలు అధికారులు, ముఖ్యంగా పోలీసులు ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంది. అందుకే గొడవలు కాకుంటే చాలు మహాప్రభో అంటూ వైసీపీ కోరుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ఏంటో చూడాలి మరి.