అమృతతుల్యంగా.. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అయ్యిందని వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా.. ఎవరినోట విన్నా సనాతన ధర్మం, ప్రాయశ్చిత్త దీక్ష.. ఈ రెండు మాటలే కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి.! ఇంతకీ సనాతన ధర్మం అంటే ఏమిటి..? దీని గురుంచి ఎవరికి ఎంత మాత్రం తెలుసు..? దీన్ని పాటిస్తున్నది ఎవరు..? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే.. పదే అని సనాతన ధర్మం అని ఎందుకు అంటున్నారు..? ఇక సేనాని చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సరైన అర్థం ఏంటి..? ఇప్పుడే ఎందుకు ఇలా పాపులర్ అయ్యింది..? పోనీ ఇదివరకూ జనాలకు ఈ ధర్మం, దీక్షల గురుంచి తెలియదా..? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి.
ఏమిటీ సనాతన ధర్మం..?
సనాతన ధర్మం అనేది రెండు పదాల కలయిక.. ఇవి రెండూ సంస్కృతం నుంచి ఉద్భవించాయి. సనాతనం అంటే.. నిత్యమైనది.. ఏనాటికీ మారనిది అని అర్థం. ఇక ధర్మం అంటే.. జీవన విధానం అని అర్థం. సనాతన ధర్మం అంటే.. ఎప్పటికీ మారని, నిత్యమైన జీవన విధానం. ఒక్క మాటలో చెప్పాలంటే.. సనాతన అనే పదం శాశ్వతమైన లేదా సంపూర్ణమైన విధులను సూచిస్తుంది. తరగతి, కులం లేదా వర్గాలతో సంబంధం లేకుండా మనుషులందరికీ ఒకే విధమైన అభ్యాసాలను సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మానవ జాతి సమస్తం వసుదైక కుటుంబం అని స్పష్టంగా చెబుతుంది. సనాతనంలో కుల, మత ప్రస్తావనే ఉండదు.. ఉండకూడదు. ఆది శంకరాచార్యులు ఇదే చెప్పారు. అద్వైతం కూడా ఇదే చెబుతోంది. సనాతన ధర్మం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టత లేదు కానీ.. యుద్ధం సమయంలో అర్జునుడు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో సనాతన ధర్మం చాలా పాపులర్ అయింది. సనాతనం ధర్మం ప్రాంతాలు, కాలాలను బట్టి మారదు. వందల ఏళ్లు అయినా.. ప్రపంచం ఈ మూలనుంచి ఆ మూల వరకూ ఒకే విధంగా ఆచరణలో ఉంటుంది.. ఆచరింపబడుతుంది. సనాతన ధర్మం నాటినుంచి నేటి వరకు శాంతికి పెద్ద పీట వేస్తోంది.
ఎందుకో.. ఈ ప్రాయశ్చిత్త దీక్ష!
చేసిన తప్పును గుర్తించి దానికి పాప పరిహారం చేసుకునేందుకు చేసే దీక్ష పేరే ప్రాయశ్చిత్త దీక్ష. పెద్దలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. మీరు చేసిన పాపం బయటపడినా, పడకపోయినా.. ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా.. చివరకు మీరు కూడా అంగీకరించకపోయినా.. భగవంతుడి కళ్లుమూసేయలేరు.! మిమ్మల్ని అనుక్షణం గమనించే పంచభూతాల నుంచి తప్పించుకోలేరు.. ఇవన్నీ భగవంతుడు చిట్టారాసి పెడతారట. పాపాలను మొత్తం లిస్ట్ రాసే భగవంతుడు వెంటనే శిక్షలు వేయకుండా.. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో శిక్ష వేస్తారట. అందుకే.. చేసిన పాపానికి ఈ జన్మలోనే పరిహారం చేసుకునేందుకు భగవంతుడు ఇచ్చిన అద్భుత అవకాశమే ప్రాయశ్చిత్తం అని.. దీన్ని ఉపయోగించుకుని ప్రక్షాళన చేసుకుంటారో.. కర్మ ఫలాన్ని జన్మజన్మలకు అనుభవిస్తారో మీ ఆలోచనపై ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతున్న మాటలు. చూశారుగా.. ఇదీ సనాతన ధర్మం.. ప్రాయశ్చిత్త దీక్ష అంటే అసలు సిసలైన అర్థం. దీన్ని బట్టి మీకంటూ ఓ అభిప్రాయం వచ్చే ఉంటుంది కదా.. ఆ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.