డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బకు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దేవుడు గుర్తొచ్చాడు..! అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. తిరుమల లడ్డూ వివాదం రోజు రోజుకూ రాజుకుంటున్న తరుణంలో పవన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అటు టీడీపీ కూటమికి.. ఇటు వైసీపీకి అస్సలు అంతు చిక్కడం లేదు. మరీ ముఖ్యంగా.. మీడియా ముందుకొచ్చి సేనాని మాట్లాడుతున్న ఒక్కో మాట ఒక్కో తూటాలాగా దూసుకెళ్తోంది. దీంతో వైసీపీ గజ గజా వణికిపోతోందనే టాక్ గట్టిగానే నడుస్తోంది.
పేరు ఎత్తట్లేదుగా..!
వాస్తవానికి.. ఎన్నికలు ముగిశాక వైఎస్ జగన్ నోట ఎప్పుడూ ఎక్కడ పవన్ పేరు వచ్చిన దాఖలాలు ఐతే అస్సలు లేనే లేవని చెప్పుకోవాలి. ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదంలో కూడా సీఎం చంద్రబాబు కంటే ఎక్కువగానే పవన్ మీడియా ముందుకు వస్తున్నారు.. దీంతో పాటు వైసీపీని నేరుగా టార్గెట్ చేస్తూ దుమ్ము లేపి వదులుతున్నారు. ప్రాయశ్చిత్త దీక్షకు దిగడం, దుర్గగుడి శుద్ధి, 11 రోజుల తర్వాత తిరుమల తిరుపతికి కూడా కాలి నడకన వెళ్లనున్నారు. ఇక సనాతన ధర్మం, దీక్ష గురుంచి ఎవరేం మాట్లాడినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీడియా ముఖంగా లేదా.. సోషల్ మీడియా వేదికగా గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు. ఎన్నికల తర్వాత మొదలుకుని నిన్న మొన్నటి లడ్డూ వివాదంపై ప్రెస్ మీట్ వరకూ ఎక్కడా జగన్.. పవన్ పేరు ఎత్తింటే ఒట్టు.
దెబ్బకు తిరుమలకు..!
తొలుత జగన్.. ఆ తర్వాత తన పార్టీ నేతలు పేర్ని నాని, కొడాలి నానిలతో మీడియాతో మాట్లాడించిన ఆయన ఇప్పుడు ఈనెల 28న వైసీపీ నేతలు, కార్యకర్తలు అంతా సమీపంలో ఉన్న ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ఇదంతా ఎప్పుడు జరుగుతోంది.. పవన్ సీరియస్ గా తీసుకున్న తర్వాతే కావడం గమనార్హం. ఇక జగన్ కూడా.. ఈనెల 27న తిరుమలకు వెళ్లనున్నారు. శుక్రవారం రాత్రికి ఆయన తిరుమల చేరుకొని.. మరుసటి రోజు సెప్టెంబరు 28 అనగా శనివారం ఉదయం స్వామివారిని జగన్ దర్శించుకుంటారు. దీంతో చూశారుగా.. పవన్ దెబ్బకు జగన్ తిరుమల వెళ్తున్నారని టీడీపీ కూటమి కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.
నేరుగా రంగంలోకి..!
మీడియా ముందుకు వచ్చిన జగన్.. చంద్రబాబు మాటలకు రియాక్ట్ అయ్యారు.. కానీ ఎక్కడా పవన్ మాటలకు స్పందించకుండా సైలెంట్ అవ్వడం ఏంటి..? పవన్ అంటే జగన్ రెడ్డి భయపడుతున్నారా..? అనే ప్రశ్నలు సొంత పార్టీ కార్యకర్తలు నుంచి వస్తున్న పరిస్థితి. ఐనా పవన్ అంటే కొన్ని నెలలుగా ఎందుకు వైసీపీ.. ముఖ్యంగా జగన్ పట్టించుకోవట్లేదు. ఆ పేరు కూడా ఎందుకు ప్రస్తావించడం లేదో మరి. ఐతే.. మీడియా ముందుకు వచ్చిన పేర్ని, కొడాలి ద్వారా మాట్లడించడం ఏంటో అని ఒకింత జగన్ అభిమానులు అసంతృప్తి ఐతే వ్యక్తం చేస్తున్నారు.
తగ్గేదెలా..!
ఇదిలా ఉంటే.. లడ్డూ అంశంలో ఎవరేం మాట్లాడినా సరే స్వయంగా పవన్ ప్రతిస్పందిస్తున్నారు. కానీ జగన్ ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు ఎందుకో మరి. ఇదిలా ఉంటే.. పవన్ ఎవరేం మాట్లాడిన గట్టిగా ఇచ్చి పడేస్తుండటంతో ఇప్పట్లో ఈ అంశం తెరమరుగయ్యే అవకాశం లేదని అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఎవరైనా సనాతన ధర్మం, లడ్డూ లడాయిపై ఏ స్థాయి వ్యక్తి మాట్లాడినా ఊరుకునేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చి పడేసారు. దీంతో పవన్ మాట ఎత్తడానికి జగన్ మొదలుకుని వైసీపీ నేతలు కంగారుపడుతున్నారట. మొత్తానికి చూస్తే.. పవన్ విషయంలో జగన్ అండ్ కో బ్యాచ్ ఎందుకో ఆచి తూచి అడుగులు వేస్తోందని మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది. మున్ముందు ఇంకా ఏమేం జరుగుతుందో.. లడ్డూ వివాదం ఎంతవరకూ వెళ్తుందో చూడాలి మరి.