అబ్బో.. ఇంకా ఏంటి మీడియా ముందుకు రాలేదు.. వచ్చి చాలా రోజులే అయ్యిందే.. ఇంతకీ నానీలు ఏమయ్యారు..? ఎక్కడికి వెళ్ళిపోయారు..? అని వైసీపీ నానీలు అదేనండీ.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు. ఈ ఇద్దరి గురుంచి మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న తరుణంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ప్రత్యక్షం అయ్యారు. పేర్ని అయినా అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడం, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశాల్లో కనిపించినా కొడాలి మాత్రం అడ్రస్ లేరు.. కొంపదీసి నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారా..? అని అనుకుంటున్న తరుణంలో మీడియా ముందుకు విచ్చేశారు. వచ్చీ రాగానే మునుపటిలా నోటికి పని పెట్టేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మంత్రి నారా లోకేష్ వరకూ పేర్లు ప్రస్తావించి మరీ రచ్చ రచ్చే చేశారు. ఇక లడ్డూ వివాదంపై ఐతే సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలే చేశారు నానీలు. వీరికి తోడు ఎన్నాళ్ళో మీడియాకు ముఖం చాటేసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వచ్చారు.
దీక్ష ఎందుకు పవన్..?
సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహాలు లాంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని సీఎం, డిప్యూటీ సీఎంలపై పేర్ని నాని మండిపడ్డారు. ఇంత చేశారు కాబట్టే.. రాజకీయాల కోసం దేవుడి ప్రసాదం మీద తప్పుడు మాటలు మాట్లాడారన్నారు. అందుకే.. పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని అనుకుంటా? అంటూ పేర్ని సెటైర్లు వేశారు. కూటమి నేతలు తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారన్నారు. అందుకే.. సెప్టెంబర్ 28న కూటమి నేతల పాపాల్ని క్షమించి వదిలి వేయాలని పూజలు నిర్వహించాలని వైసీపీ కార్యకర్తలు, నేతలను పేర్ని కోరారు. పవన్, చంద్రబాబు ఒకే ఆత్మగా ఉన్నారని.. రాజకీయాల కోసం వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశామని వాళ్ళ ఆత్మ దహించుకుపోతుందని విమర్శలు గుప్పించారు. బాప్తిజం తీసుకున్న హిందువు, హలాల్ చేసిన పెద్ద ముక్కలు అడిగి మరీ తిన్న హిందువు, మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టిన మగ ముత్తైదువు పవన్ కళ్యాణ్ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.
దేవుడు క్షమించడు..!
తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి చంద్రబాబు కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబును దేవుడు కూడా క్షమించరని.. రాజకీయాల కోసం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారన్నారు. జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తిరుమలను రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నారు. చంద్రబాబుకి బుద్ధి రావాలని, ప్రసాదంలో ఏ తప్పు జరుగలేదని భక్తులకు తెలియాలన్నారు. లడ్డూ వివాదంలో ఎలాంటి ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నామని జగన్ ప్రధానికి, సుప్రీంకు లేఖలు రాశారన్న విషయాన్ని గుర్తు చేశారు. నాకు 50 ఏళ్ల వయసు. నేను తిరుపతి 45 సార్లు వెళ్లా.. 15 సార్లు కాలినడకన వెళ్లాను. 20 సార్లు గుండు కొట్టించుకున్నాను. వెంకటేశ్వర స్వామి భక్తుడిని అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నిసార్లు వెళ్ళారు..? ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చారు..? అని నాని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎంత కంట్రోల్..!
వాస్తవానికి.. వైసీపీ అధికారంలో ఉండగానే కొడాలి నానికి బూతు మంత్రి అని బిరుదు టీడీపీ ఇచ్చేసింది. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నాను రోజులు నోరు తెరిస్తే అబ్బో బూతులే.. బూతులు. 2024 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయిన తరువాత ఒకటి రెండు సందర్భాల్లో తప్పితే ఎక్కడా కొడాలి కనిపించలేదు.. ఆయన వాయిస్ కూడా వినిపించలేదు. ఆఖరికి సొంత నియోజకవర్గం గుడివాడలో గుడ్లవల్లేరు కాలేజీలో పెద్ద రచ్చ జరిగినా కనీసం స్పందించలేదు. దీంతో ఏమండోయ్ నాని గారు.. ఏమయ్యారు..? అంటూ ఒక్కటే విమర్శలు, సెటైర్లు పెద్ద ఎత్తునే వచ్చాయి. ఇప్పుడు వైసీపీ పెద్ద వివాదంలో చిక్కుకుంది.. దీంతో ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తుండగా కొడాలి నాని కూడా వచ్చేశారు. ఐతే నోరు తెరిస్తే బూతులు మాట్లాడే నాని.. కంట్రోల్ తప్పకుండా.. రెచ్చిపోయి మాట్లాడకుండా జాగ్రత్తగానే మాట్లాడారు.