తిరుమల లడ్డూ వివాదం రోజు రోజుకూ రాజుకుంటున్న తరుణంలో వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోవైపు సామాన్యుడు నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరు చూసినా శ్రీవారి లడ్డూ వ్యవహారంపై మాట్లాడుకుంటున్న.. అంతకు మించి మండిపడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జగన్ చేసిన ప్రకటనతో వివాదం మరింత ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇదీ ప్రకటన..
తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను,వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిస్తోంది అని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు.
ఆలస్యం అయ్యిందేమో..!
వైఎస్ జగన్ పిలుపును చాలా మంది గౌరవంగా స్వీకరిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆలస్యం ఐనా మంచి నిర్ణయమే తీసుకున్నారని మెచ్చుకుంటున్నారు. కొత్త హిందువు మళ్ళీ మేల్కున్నాడు రోయ్.. అంటూ మరికొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్న పరిస్థితి. ఇంకొందరు ఐతే.. ఇంతకు మీ కుటుంబము గుడికి వస్తుందా ఆ రోజు..? గుడికి వెళ్తారా..? లేదా గుడి సెట్టింగులో పూజలు చేస్తారా..? అని లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్న తిరుమలలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం విషయంలోనే ఎంత రాద్దాంతం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్ చేసిన ప్రకటనతో శనివారం నాడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.