అభిమానం ఉండొచ్చు కానీ.. ప్రాణాలు పోయేంత, కుటుంబాలను అనాధలుగా మార్చేంతటి అభిమానం ఉండకూడదు. ఒకపక్క పోలీసులు చెబుతున్నా వినకుండా గేట్స్ విరగ్గొట్టి హీరోను చూసెయ్యాలనే కోరిక ఏమిటో వారికే తెలియాలి. అసలు నేరుగా హీరో తో మాట్లాడే అవకాశం ఉండకపోయినా, హీరోకి కరచలనం చేసే అవకాశం రాకపోయినా, నేరుగా హీరో దగ్గరకు వెళ్లకపోయినా.. దూరం నుంచి చూసి, దూరం నుంచే హీరోగారి స్పీచ్ వినాలనే కోరికతో అభిమానులు తమ సేఫ్టీ విషయాన్నీ మరిచిపోతున్నారు.
హీరోలు కూడా తమ కోసం అభిమానుల విషయం లెక్కలు వేసుకుని ఫంక్షన్స్ నిర్వహిస్తే మాత్రం అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అభిమానులు కూడా కొన్ని కొన్ని సందర్భాలను అర్ధం చేసుకోవాలి. కానీ వారు మాత్రం హీరో ని చూస్తే చాలనుకుని వెర్రెత్తిపోయి రచ్చ రచ్చ చేస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ ఫాన్స్ దేవర ప్రీ రిలీజ్ వేదిక వద్ద చేసిన రచ్చ చూస్తే మాత్రం నిజంగా ఫ్యాన్స్ ఇంత వెర్రివాళ్ళా అని అంటారు. 6వేల కెపాసిటీ ఉన్న హోటల్ కి 30 వేలమంది రావడం అటు ఈవెంట్ నిర్వాహకుల తప్పో, లేదంటే అభిమానుల ఆరాటమో తెలియదు కానీ.. నోవాటెల్ హోటల్ మొత్తం పాక్షికంగా ధ్వంశం అయ్యింది.
చివరికి సెక్యూటి, పోలీసులు అభిమానులను అదుపు చెయ్యలేక ఈవెంట్ క్యాన్సిల్ చేసారు. గేట్లు ఓపెన్ కాకముందే ఆ గేట్లను విరగ్గొట్టి ఈవెంట్ ప్రాంగణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరుగులు తీసిన వీడియోస్ చూస్తే అభిమానుల్లో ఈ వెర్రి తగ్గితే బావుంటుంది. ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా తమ కుటుంబాల గురించి ఆలోచన చెయ్యకుండా, హీరో కోసం ఇలా పోలీస్ లతో దెబ్బలు తింటూ తొక్కుకుంటూ ఈవెంట్ కోసం పరుగులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది వారిని వారు ప్రశ్నించుకోవాలి.