పంతం నానాజీ.. జనసేన తరపున కాకినాడ రూరల్ నిజయకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. ఈయన పేరుకే ఎమ్మెల్యే కానీ.. ఒక్కసారి నోరు తెరిస్తే బాబోయ్ ఈయన ప్రజాప్రతినిధేనా..? అనే సందేహాలు కచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఈయన తాజా బాగోతం చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బూతులతో.. పచ్చి బూతులతో రెచ్చిపోయారు. ఇదంతా నాలుగు గోడల మధ్య జరిగింది అనుకుంటున్నారేమో అబ్బే అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నలుగురిలో.. అది కూడా మెడికల్ కాలేజీ డాక్టర్ పైన నోటికొచ్చిన బూతులు మాట్లాడి నవ్వులపాలయ్యారు.
అసలేం జరిగింది..?
ఏంటిరా నా కొడకా.. అంటూ బూతులతో రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై పంతం నానాజీ, ఆయన అనుచరులు విరుచుకుపడ్డారు. ఇదంతా ఆ డాక్టర్ ఏదో చేయకూడని తప్పు చేసారేమో అందుకే ఎమ్మెల్యే ఇలా చేశారా అంటే అబ్బే సిల్లీ పనికే ఇదంతా. కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే కోరారు. ఐతే.. ఉన్నతాధికారుల పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న ఆర్ఎంసి అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. శనివారం సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న క్రీడాకారులను పర్మిషన్ వచ్చిన తర్వాతే అనుమతి ఇస్తామని ఉమామహేశ్వరరావు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే నానాజీకి అనుచరులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఆగ్రహంతో అక్కడికొచ్చి ఉమామహేశ్వరరావుపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా నోటికొచ్చినట్టు తిట్టి.. దాడి కూడా చేశారు నానాజీ. ఏరా.. కొడకా.. చంపేస్తాను నా కొడకా.. ఏంటి రా నన్ను తిట్టావంట.. చదువుకునే కుర్రాళ్లను రెచ్చగొడతావా.. అంటూ నోటికొచ్చినట్టు నానాజీ బండ బూతులు తిట్టడం, అనుచరులతో కలిసి పిడిగుద్దులతో దాడి చేయడం సిగ్గుచేటు. ఒక్క మాటలో ఎవరీయన..? ఎమ్మెల్యేనేనా..? రౌడీ షీటరా..? అని చుట్టుపక్కల ఉండే జనాలు, విద్యార్థులు ముక్కున వేలేసుకున్న పరిస్థితి.
రగిలిపోతున్న మెడికో!
డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జరిగిన దాడిని విద్యార్ధులు, దళిత సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే.. ఎమ్మెల్యే పంతం నానాజీని బర్తరఫ్ చేసి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. నానాజీ దౌర్జన్యానికి నిరసనగా ఆదివారం నుంచి విధులు బహిష్కరిస్తామని వైద్యులు, జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ప్రిన్సిపాల్ సహకారంతో వైద్యులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు జరిగిన సంఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నానాజీపై క్రిమినల్ చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు.
రాజీనా.. తగ్గేదేలా..?
ఓ వైపు మీడియాలో.. మరోవైపు సోషల్ మీడియాలో నానాజీ బాగోతం మొత్తం రచ్చ రచ్చ అవుతుండగా నష్ట నివారణ చర్యలు షురూ చేసింది జనసేన. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నానాజీ, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘటనా స్థలానికి వచ్చి ఇరుపక్షాలను రాజీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఐతే వైద్యులు, మెడికోలు మాత్రం వద్దంటే వద్దు అని ససేమిరా అన్నారు. దీనికి తోడు సదరు డాక్టర్ దళితుడు కావడంతో ఇది దళిత జాతికి జరిగిన అవమానమంటూ దళిత నేతలు, విద్యార్థులు ధర్నాకు దిగారు. ఆఖరికి ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాకా వెళ్లింది. ఇక చేసేదేమీ లేక వైద్య సిబ్బంది, ఉమామహేశ్వరరావుకు అందరికీ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు.
ఇంత దారుణమా..?
అసలే ఇప్పుడు సోషల్ మీడియా కాలం. ప్రత్యర్థులు ఎక్కడ దొరుకుతారా..? అని వైసీపీ.. బూతద్దాలు పెట్టుకొని మరీ వెయి కళ్ళతో ఎదురుచూస్తోంది. ఇసుమంత తప్పు చేసినా సరే కార్యకర్తలు మొదలుకుని నేతల వరకూ ఇట్టే దొరికిపోతున్నారు. అలాంటిది ఒళ్ళు దగ్గరపెట్టుకొని పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే కాదు.. జనసేన కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు, నేతలు ఎవ్వరైనా సరే ఏదైనా తప్పు చేస్తే అది పార్టీకి.. దానికంటే ముందు అధినేతకు చెడ్డ పేరు వస్తోందనే విషయం తెలుసుకుని నడుచుంటే మంచిది. ఇక పంతం నానాజీ అంటారా.. తమరి పంతాలు, పట్టింపులు, ఈ గొడవలు అన్నీ ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిన ప్రజల కోసం.. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చూపిస్తే మంచిది సుమీ. ఎమ్మెల్యే అంటే ప్రజలకు.. ప్రభుత్వానికి వారధిగా ఉండాలే తప్ప చెత్త పనులు చేసి ప్రజాప్రతినిధి అనే పదానికి, పదవికి కళంకం తెచ్చేలా ఉంటే ఎలా..? ఇకనైనా నానాజీ.. ఒళ్ళు, చేతులు అంతకు మించి నోరు అదుపులో పెట్టుకొని నడుచుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.