తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒకటా.. రెండా లెక్కలేనన్ని రూమర్స్, అంతకు మించి ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయ్..! ఇదంతా ఎవరు చేస్తున్నారు.. ఏంటి..? ఇందులో సూత్రధారులు, పాత్రదారులు..? ఎవరు అనేది తెలియట్లేదు కానీ గల్లీ నుచి ఢిల్లీ వరకూ సీఎంపై పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది..!
బాబోయ్ ఏంటిది..!?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి వేరొకరికి ఆ సీటు ఇస్తారని గత వారంలో ఒక్కటే వార్తలు. కొన్ని యూట్యూబ్ చానెల్స్, ఇంకొన్ని గల్లీ న్యూస్ పేపర్లు ఒక్కటే రచ్చ రచ్చ చేశాయి. ఇందుకు లేనిపోని కారణాలు చెప్పడం గమనార్హం. అమలు కాని హామీలతో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. ఎమ్మెల్యేల చేరికల విషయంలోనూ ఎదురుదెబ్బలు తగిలాయని.. పార్టీ కంటే సొంత ఇమేజీపైనే ఫోకస్ పెట్టారని విమర్శలు గట్టిగానే మసాలాలు దట్టించారు. దీనికితోడు తెలంగాణలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారని.. సీఎం దగ్గరే ఉన్నా లా అండ్ ఆర్డర్ ఆగమాగం అయ్యిందని అందుకే సీఎంను మార్చక తప్పలేదని.. త్వరలోనే నిర్ణయం ఉంటుందని ఢిల్లీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోందని సదరు పత్రికలు రాతలు చేయడం విచిత్రంగా ఉంది.
ఇంత దారుణమా!
ఇదంతా ఒక ఎత్తయితే.. ఢిల్లీ హైకమాండ్ అసంతృప్తి రేవంత్ మీద స్పష్టంగా కనిపిస్తోందని కొన్ని కారణాలు చెబుతూ మరికొన్ని చోటా మోటా డిజిటల్ పేపర్లు రాసుకొచ్చాయి. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీలు సైతం రేవంత్ రెడ్డికి సమయం ఇవ్వకపోవడం.. ఇదే రేవంత్ నాయకత్వంపై వారి నమ్మకం తగ్గిందని భావింపక తప్పదని మరికొందరు సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. దీనికి తోడు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి పాత నాయకులను కలవడం, కానీ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టడం హైకమాండ్ లోనే సీఎం మీద ఆలోచనలు మారుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయని వార్తలు వస్తుండటం గమనార్హం.
అవసరమా..?
కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి.. సామాన్య కార్యకర్తగా మొదలై తెలంగాణ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే అంత ఆషామాషీ ఐతే కానే కాదు. ఆయనకే గాడ్ ఫాదర్స్ లేరు.. ఆయనకున్నదల్లా మాస్ ఫాలోయింగ్.. వాక్ చాతుర్యం, పోరాట పటిమ అంతే. ఎన్ని సార్లు జైలుకు వెళ్లారో.. ఎన్ని సార్లు గల్లీ నుంచి యావత్ రాష్ట్రం మొత్తం చూసేలా చేసుకున్న మాస్ లీడర్ రేవంత్. అసలు కాంగ్రెస్ అంటే కొట్లాటలకు కేరాఫ్ అడ్రస్ అలాంటిది.. ఈయన పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి గొడవలు చాలా వరకు తగ్గాయి. అలా అందరినీ కలుపుకొని ఎన్నికలకు వెళ్లి.. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన, వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీని ఘోరాతి ఘోరంగా ఓడించి కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డిని.. హైకమాండ్ పిలిచి మరీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అలాంటిది ఇప్పుడు అగ్ర నేతలు గుర్రుగా ఉన్నారు..? తొక్క, తోలు తోటకూర అంటే నేతలు సంగతి అటుంచితే.. కనీసం కార్యకర్తలు అయినా నమ్మే పరిస్థితి ఉందా..? అంతే వందకు వెయ్యి శాతం లేనే లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. కాస్త ఇలాంటి చిల్లర మల్లర వార్తలు మానితే మంచిదేమో..!