రాజకీయంగా కొట్లాడాలి అనుకున్నా.. పోరాటం చేయాలని అనుకున్నా చేయ్.. బంగారంగా చేయ్.. మేమంతా ఆహ్వానిస్తాం.. ప్రజలకు మంచి చేయ్.. మంచి చేస్తామనే కదా అధికారంలోకి వచ్చావ్.. చేసి ప్రజల మన్ననలు పొందు.. కానీ ఇదేం రాజకీయం.. అపద్దాన్ని సృష్టించడం, దాన్ని అమ్మడం.. ఆ అపద్ధం ద్వారా బురద జల్లడం ఏంది ఇదంతా.. ఇవీ టీటీడీ లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు చేసిన సంచలన ఆరోపణలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన కౌంటర్. గత రెండు మూడు రోజులుగా తిరుమల లడ్డుపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించిన వైఎస్ జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
అంతా డైవర్షన్!
చంద్రబాబు.. ప్రతి విషయంలోనూ డైవర్షన్ పాలిటిక్సే కనిపిస్తున్నాయని జగన్ దుయ్యబట్టారు. ఆటవిక పాలనపై ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే మదనపల్లి ఫైల్స్ దగ్ధం పేరుతో డైవర్షన్ చేశారని.. స్కాముల్లో తనను అరెస్ట్ చేశారంటూ ఐఏఎస్, ఐపీఎస్‌లను వేధిస్తున్నారన్నారు. ముంబై నుంచి సైడ్ యాక్టర్ ను తీసుకొచ్చి మరో డైవర్షన్‌కు తెర తీశారని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో అంతా మోసమే.. దాన్ని కప్పిపుచ్చడానికే.. చంద్రబాబు లడ్డూ ఇష్యూను తెరపైకి తెచ్చారని గట్టి కౌంటర్ ఇచ్చారు జగన్.
లడ్డు వివాదంపై..!
దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదే. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టు కథ. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా..? ఒక సీఎం ఇలా అబద్దాలు ఆడడం ధర్మమేనా.? భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా..? ప్రతి 6 నెలలకు ఓసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరూ మార్చలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోంది. మన తిరుమల శ్రీవారి లడ్డులకు వాడే నేయి సేకరించే ప్రక్రియ ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పాల్సింది పోయి ఇలా తప్పుడు ప్రచారం చేస్తావా? అని చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న సంధించారు. అంతే కాదు ఈ వివాదంపై ప్రధాని మోదీకి.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ కూడా రాసి చంద్రబాబు అక్షింతలు పడేలా చేస్తాం అన్నారు.
ఒకటి కాదు మూడు..!
ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది.. నెయ్యి తెచ్చే ప్రతి ట్యాంకర్ NABL సర్టిఫికెట్ తీసుకుని రావాలి. ప్రతి ట్యాంకు శాంపిళ్లను మూడుసార్లు టెస్ట్ చేస్తారు. మూడు టెస్టులు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుంది. చంద్రబాబు జరగనిది జరిగినట్లు అబద్ధాలు చెబుతున్నారు. జులై 12న శాంపిల్స్ తీసుకున్నారు.. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారు. జులై 17న NDDBకి నెయ్యి శాంపిల్స్ పంపించారు. NDDB ఆ రిపోర్ట్‌ను జులై 23న అందజేసింది. జులై 23న రిపోర్ట్ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం అని జగన్ ప్రశ్నించారు. టీటీడీలో పని ఉద్యోగులకు జీతాలు, ఇళ్ల పట్టాలు.. అర్చకులకు జీతాలు పెంపు మొదలుకుని అమరావతి నుంచి కాశ్మీర్, అమెరికా వరకూ టీటీడీ తరఫున దేవాలయాలు కట్టింది, అభివృద్ధి చేసింది వైఎస్ఆర్సీపీనే అని బల్ల గుద్ది మరీ చెప్పారు జగన్.
సమాధానం దొరికినట్లేనా..?
వాస్తవానికి గత కొన్ని గంటలుగా ఎవరి నోట విన్నా.. ఏ టీవీ ఛానెల్ చూసినా.. వెబ్ సైట్ ఓపెన్ చేసినా.. యూట్యూబ్ తెరిచినా.. ఇక సోషల్ మీడియాలో ఐతే ఇదే చర్చ, రచ్చ. ఓ వైపు టీడీపీ విమర్శలు.. మరోవైపు వైసీపీ కౌంటర్లు ఇలా పెద్ద యుద్ధమే నడిచింది. మొత్తానికి చూస్తే జగన్ మీడియా ముందుకు రావడంతో మిలియన్ డాలర్ల ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అని వైసీపీ గర్వంగా చెప్పుకుంటోంది. దీనికి తోడు జగన్ సవాళ్లు కూడా చేయడంతో ఇప్పుడు జగన్ కామెంట్లపై చర్చ నడుస్తోంది. నాకు పరిపాలన చేత కాదు.. కేవలం మత పరమైన రాజకీయాలు మాత్రమే చేస్తాం అని వారిని చెప్పమనండి.. అని ప్రస్తుత సీఎంకు మాజీ సీఎం సవాల్ కూడా చేశారు. ఇప్పుడు జగన్ కామెంట్లపై టీడీపీ, హిందూ ధార్మిక సంఘాల నుంచి.. మరీ ముఖ్యంగా జాతీయ మీడియా నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.