అవును నిజమే.. టీటీడీ చరిత్రలో తొలిసారి!!
యావత్ ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి. దీనిపై టీడీపీ కూటమి.. వైసీపీ మధ్య ఎన్నికలను మించిన యుద్ధమే నడుస్తోంది. ఒకసారి కాదు రెండుసార్లు లడ్డులో జంతువుల నూనె వాడారని చెప్పడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచం మొత్తం చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలో అసలు ఇందులో నిజానిజాలు ఏంటి..? నిజంగా లడ్డూలో నాణ్యత లోపించిందా..? అనే విషయాలపై స్పష్టత ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు మీడియా ముందుకు వచ్చారు.
అవును నిజమే..!
తిరుమల లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వస్తుండటంతో ల్యాబ్ టెస్టులు నిర్వహించామని ఈవో మీడియాకు వెల్లడించారు. ఈ పరీక్షలో నాసిరకం నెయ్యి కారణంగానే లడ్డూ ప్రసాదం నాణ్యత లోపించిందన్నారు. తిరుమల ప్రసాదంలో వాడుతోంది నెయ్యేనా..? లేదా నూనె..? అనే అనుమానాలు రావడంతో సరఫరాదారులను
హెచ్చరించమని చెప్పుకొచ్చారు. ఐతే.. కల్తీ పరిశీలనకు 75లక్షలతో ఏర్పాటు చేయగల ల్యాబ్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. గతంలో సరైన పరీక్షలు చేయకపోవడంతో సరఫరాదారులు కల్తీ చేసే అవకాశమిచ్చారన్నారు.
ఇదెలా సాధ్యం..?
గతంలో సాధ్యంకాని ధరలకు ప్రసాదం నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారని ఈవో చెప్పుకొచ్చారు. రూ. 220 నుంచి 410 వరకూ ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారో అర్ధం కాలేదు..? తక్కువధరకు కొనడం వల్ల నాణ్యతపై కంట్రోల్ ఉండదు..? ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదు..? 320 రూపాయలకు కల్తీ నెయ్యి మాత్రమే వస్తుందని అర్థమైంది. గుజరాత్‌లోని NDDB కాఫ్ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపగా.. 90శాతానికి పైగా క్వాలిటీ ఉండాల్సిన నెయ్యి 20శాతం కూడా క్వాలిటీ లేదని తేలినట్టు ఈవో తెలిపారు.
ఏం తేలింది..?
పరీక్షల్లో సోయా, సన్‌ఫ్లవర్ సహా అనేక ఆయిల్స్ మిక్స్ అయ్యాయని, పిగ్ స్కిన్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్స్ కూడా నెయ్యిలో ఉందని పరీక్షల్లో తేలిందని శ్యామల రావు స్పష్టం చేశారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సరఫరాదారుడిని వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని.. న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని కూడా మీడియా ముఖంగా తెలియజేశారు. నైవేద్యానికి వాడుతున్న సేంద్రీయ పదార్థాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశామని.. కల్తీ పరీక్ష కోసం బయటకు పంపడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి అని ఈవో చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే ఈవో పేల్చిన ఈ బాంబ్ దెబ్బకు ఈ వివాదం మరింత ముదిరింది. ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి మరి.