తిరుమల లడ్డు విషయంలో అసలేం జరుగుతోంది..? ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసేస్తున్నారు..? ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు..? స్వయానా సీఎం చంద్రబాబు నోట ఈ కామెంట్స్ రావడంతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఇదొక చర్చ, రచ్చగా మారింది. ఇంతకీ లడ్డు వివాదంపై సమాధానం దొరుకుతుందా..? పోనీ గత ఐదేళ్లలో మీకెప్పుడైనా తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గిందని అనిపించిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం చిత్ర విచిత్రంగా వస్తున్నాయ్. ఇది కాస్త టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా పరిస్థితులు నెలకొన్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే అసలేం జరిగింది..? ఇందులో నిజానిజాలు ఎంత..? అని ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకు విచ్చేస్తున్నారు.
సమాధానం దొరుకుతుందా..?
జగన్ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గిందని.. లడ్డు తయారీలో జంతువుల నూనె కలిసి ఉన్న నెయ్యిని వాడారనే ఆరోపణలు రావడం, దీనికి తోడు ల్యాబ్ రిపోర్టు కూడా బయటికి వచ్చిన నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు నేషనల్ మీడియాలోనూ.. ఇక సోషల్ మీడియాలో ఐతే అబ్బో మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ మీడియా ముందుకు వస్తుండటంతో ఇందులో నిజానిజాలు ఎంత..? ఇది నిజంగానే జరిగిందా..? అనే మిలియన్ డాలర్ల ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని సొంత పార్టీతో పాటు యావత్ హిందూ ప్రపంచమే వేచి చూస్తోంది. దీనికి తోడు పక్కా ఆధారాలతో ఇవాళ (శుక్రవారం) మీడియా ముందుకు రాబోతున్నట్టు వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద హడావుడి ఐతే జరుగుతోంది.
చదవడం కాదు.. చెప్పాలబ్బా!
మీడియా ముందుకు వచ్చామా.. వెళ్ళామా..? అని కాదు లడ్డూపై వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడమా..? నిజం కాకపోతే అది ఎలా అనేది పూర్తిగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో ఎడాపెడా సోషల్ మీడియాలో నడుస్తున్న వాటినే చదవకుండా.. అదే పాత చింతకాయ పచ్చడే కాకుండా పక్కా ఆధారాలతో, ఒక్కసారి మాట్లాడితే మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు రాకుండా కూడా ఉండేలా చేయాలని వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఏదో మీడియా ముందుకు వచ్చామా స్క్రిప్ట్ చదివామా..? అనేది కాదు మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు కూడా ముఖం చాటేయకుండా సమాధానం చెప్పాలి. అప్పుడే కదా అందరికీ అర్థం అయ్యేది. అది కూడా పూర్తి ఆధారాలతో సభ్య సమాజానికి అర్థం అయ్యేలా చెబితే బాగుంటుంది జగన్.
ఎవరి ఆరోపణల్లో వారు..!
ఐతే.. లడ్డుపై వివాదం కేవలం వైఎస్ జగన్ ఇమేజ్ డామేజ్ చేయడానికి టీడీపీ, జనసేన చేస్తున్న రాజకీయ కుట్ర అని.. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన జానీ మాస్టర్ వివాదాన్ని డైవర్ట్ చేయడానికే ఈ అంశాన్ని ఇపుడు తెరపైకి తీసుకొచ్చారని వైసీపీ నేతలు, మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు.. ఇది హిందువుల మనోభావాలు దెబ్బ తీసే దుశ్చర్య.. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని ఎన్డీఏ కూటమి నేతలు.. వైసీపీకి దిమ్మ తిరిగిపోయేలా ఆరోపిస్తున్నారు. అటు ఇటు తిరిగి.. ఈ వివాదం ఇపుడు దేశ వ్యాప్తంగా అటు ఎన్డీఏ vs ఇండియా కూటమిల మధ్య చర్చలా మారింది. ఏదేమైనా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు విషయంలో ఇంత దుమారం రేగడం బాధాకరం. ఈ వివాదానికి వైఎస్ జగన్ ఒక్క ప్రెస్ మీట్ తో ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి మరి.