అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగిందనే ఒకే ఒక్క మాట ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం చుట్టేసింది..! వేంకటేశ్వరుడి ప్రసాదంలో జంతువుల నూనె వాడటమా..? అని భక్తులు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఇదే విషయం ల్యాబ్ లో టెస్ట్ చేయగా నిజమేనని తేలడంతో ఆ మాటలకు మరింత బలం చేకూరింది. దీంతో ఈ లడ్డూ వివాదం అయ్యింది. మొత్తం ఇప్పుడు మీడియాలో.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇదంతా వైసీపీ హయాంలో జరిగిందని టీడీపీ చెబుతుండగా.. డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఇదంతా అంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంత జరిగినా, జరుగుతున్నా కనీసం నాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం బెల్లం కొట్టిన రాయిలా ఉండటం గమనార్హం.
ఎక్కడ చూసినా..!
ఈ వ్యవహారంపై టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు వర్సెస్ వైసీపీ నేతలు, కార్యకర్తలుగా సోషల్ మీడియాలో పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఆధారాలతో సహా చూపిస్తుండటంతో డిఫెన్డ్ చేయలేక వైసీపీ చేతులు ఎత్తేస్తున్నది. ఇక కొన్ని కామెంట్స్ గురుంచి ఐతే అస్సలు మాటల్లో చెప్పుకోలేం.. రాతల్లో రాయలేనివి. ఇప్పటికే వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వివాదం ముగుస్తుంది అనుకుంటే మరింత రాజుకుంది. ఇది హిందువుల మనోభవాలకు సంబందించిన విషయం కావడం, సీఎం చంద్రబాబు రెండోసారి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి మరీ మాట్లాడటంతో ఈ వ్యవహారం ఇప్పట్లో ఆగే ప్రసక్తే లేకుండా పోయింది. ఇప్పుడు రఏ ఇద్దరు కలిసినా.. టీవీలో చూసినా.. సోషల్ మీడియా ఓపెన్ చేసినా లడ్డూలో జంతు నూనె ఇదే విషయంపైనే చర్చ.. అంతకు మించి రచ్చ కూడా..!
నీకో దండం..!
వాస్తవానికి.. టీటీడీ దగ్గరే వేల కోట్ల రూపాయలు ఉండగా కల్తీ చెయ్యడానికి ఆస్కారమే లేదని కొందరు మేధావులు, రాజకీయ విశ్లేషకులు, ధార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇవన్నీ కాదు ఆ ఏడు కొండలవాడే నిజానిజాలు ప్రజలకు తెలిసేలా చెయ్యాలని కోరుకునే వారు లేకపోలేదు. ఐతే.. ఇప్పటి వరకూ పలు విషయాల్లో వచ్చిన ఆరోపణలు, విమర్శలు వేరు.. తిరుమల వివాదం వేరు. ఎందుకంటే యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, హిందువులు ప్రగాఢ నమ్మకాన్ని.. విశ్వాసానికి సంబంధించిన విషయం. అందుకే ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే.. ఈ మరక అంత సులువుగా ఐతే పోదు. దేశంలో ఒక్క శాతం ప్రజల్లోకి ఈ విషయం ఎక్కినా చాలు ఊహించని నష్టం ఐతే జరిగిపోతుంది. ఇంత జరిగినా.. జరుగుతున్నా కనీసం స్పందించక పోవడం గమనార్హం. సోషల్ మీడియా లేదంటే నేరుగా మీడియా ముందుకు వచ్చి నిజానిజాలు ఏంటో చెబితే పోయేది ఏముంది.. జగన్ అంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.
నేర్చుకో జగన్..!
ఏవైనా ఆరోపణలు, పెద్ద ఎత్తున విమర్శలు నడిచినప్పుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడతారో చూడలేదా..? ఎంతటి వారికైనా సరే సమాధానం చెప్పి మరీ మీడియా మీట్ ముగిస్తారు. అలాంటిది వైసీపీ హయాంలో తప్పు జరగకపోతే.. ఇదంతా తప్పుడు ప్రచారం అని ఒక్క మాటతో కొట్టి పారేయొచ్చు కదా..! కొన్ని గంటలుగా ఇంత రాద్దాంతం జరుగుతున్నా మౌనంగా ఉంటే.. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? మౌనానికి అర్థం అంగీకారమేనా..! వైసీపీ కార్యకర్తలు, నేతలు ఇదంతా ఆపద్దం అని చెప్పడం వేరు.. నేరుగా మీకు నేరుగా మీడియా ముందుకు వచ్చి చెప్పడం వేరు. తప్పు చేయన్నప్పుడు భయం ఎందుకు..?. ఎంతో సహనశీలి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి లాంటి వారే.. ఇది సెన్సిటివ్ ఇష్యూ, జగన్ స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెబుతున్న పరిస్థితి. అంతే కాదు వీలైతే తిరుమల కొండకు వెళ్లి వెంకన్నను దర్శించుకుని ఆ తర్వాత క్లారిటీ ఇస్తే ఇంకా మంచిది అంటూ జగన్ రెడ్డికి వైసీపీ నేతలు, ముఖ్య కార్యకర్తలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. జగన్ మనసులో ఏముందో.. ఏం చేస్తారో.. రియాక్ట్ అయ్యాక పరిస్థితి ఏంటి అనేది చూడాలి మరి.