ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ క్షణాన ఐతే వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిందో నాటి నుంచి నేటి వరకూ నేతలు పార్టీని వీడుతూనే ఉన్నారు. రావెల కిషోర్, ఆళ్ల నాని, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, బాలినేనిలతో పాటు పలువురు ముఖ్యనేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వద్దనుకుని వెళ్ళిపోయారు. బాలినేని ఇంకా వేరే పార్టీ కండువా కప్పుకోలేదు కానీ జనసేనలో చేరుకకు మాత్రం రంగం సిద్ధం చేసుకున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే మరో సీనియర్ నేత, 1999 నుంచి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న సామినేని ఉదయభాను రాజీనామాకు రెడీ అయ్యారు. ఈ మేరకు కార్యకర్తలకు కూడా ఒక మాట చెప్పేసారు.
ఎందుకు.. ఏమైంది..?
రెండున్నర దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీతో ఉన్న ఉదయభాను ఎందుకో ఇప్పుడు వైసీపీని వదులుకుంటున్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డితో.. నేడు వైఎస్ జగన్ రెడ్డికి అత్యంత సాన్నిహిత్యం ఉన్నారు. ఐతే ఈ గ్యాపులో ఏం జరిగిందో తెలియదు కానీ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 22న జనసేనలో చేరడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇదే విషయమై శుక్రవారం నాడు కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.
బాలినేనితో పాటు సామినేని!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. హైదరాబాద్ నుంచి పవన్‌ను కలిసేందుకు ఇప్పటికే విజయవాడకు బాలినేని.. బాలినేనిని చేరుకున్నారు. మరోవైపు.. ఒంగోలు నుంచి విజయవాడకు వైసీపీ నేతలు వచ్చారు. పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం లాంఛనంగా జనసేన పార్టీలో చేరే తేదీని బాలినేని ప్రకటించనున్నారు. బాలినేనితో పాటు సామినేని ఉదయభాను కూడా పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఎవరీ ఉదయభాను..?
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను 1955లో జన్మించారు. బీకాం చదివిన ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి 1999లో జగ్గయ్యపేట నుంచి గెలిచారు. 2004లోనూ రెండోసారి గెలిచి నిలిచారు. ఐతే వరుసగా రెండు సార్లు గెలిచిన సామినేని.. ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ పై ఓడిపోయారు. తిరిగి 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఉదయభాను... వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో మంత్రి పదవి దక్కుతుందని భావించారు కానీ ఆశలు అన్నీ అడియాశలు అయ్యాయి. ఈ క్రమంలో.. 2023లో టీటీడీ బోర్డు సభ్యుడిగా.. ప్రభుత్వ చీఫ్ పదవి కూడా దక్కించుకున్నారు. చూశారుగా.. వైసీపీకి ఒకింత బిగ్ షాట్ ఈయన అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు ఏమో..! ఐతే అధికారం పోయిన కొద్ది రోజులకే మనసు మార్చుకున్న సామినేని వైసీపీకి రాజీనామా చేసి.. జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. చేరిన తర్వాత అక్కడ ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో.. ఏంటో చూడాలి మరి.