మాట తప్పం.. మడమ తిప్పం ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా..! అదేనండీ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫేమస్ డైలాగ్ ఇది. అధికారంలో ఉన్నా లేకున్నా ఇది ఆయన నోట వచ్చేస్తుంటుంది. ఐతే.. ఎందుకో జగన్ ఇప్పుడు మాట మీద కాదు కాళ్ళ మీద మాత్రమే నిలబడుతున్నట్టు అర్థం అవుతోంది. ఎందుకంటే మాట ఇస్తే.. దాన్ని నెరవేర్చుకోలేకపోతున్నారు. ఇందుకు చక్కటి ఉదాహరణే బెజవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ కోటి రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించడం. కోటి ప్రకటనకే పరిమితం అయ్యింది కానీ ఇంత వరకూ సీఎం సహాయక నిధికి అందకపోవడం గమనార్హం.
ఎందుకిలా..?
బుడమేరు దెబ్బకు విజయవాడ విలవిలలాడింది.. తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక కనీసం తాగడానికి నీళ్ళు కూడా సాయం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఎంతో మంది సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లోని ప్రముఖులు అండగా నిలిచారు. లక్ష మొదలుకుని కోట్ల రూపాయల వరకూ ప్రకటించడం.. ఆ వెంటనే సీఎం సహాయక నిధికి నగదు బదలీ చేయడం, లేదా నేరుగా సీఎం చంద్రబాబు.. ఇతర మంత్రులను కలిసి చెక్కు రూపంలో ఇచ్చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ కూడా కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఐతే ప్రకటించే రోజులు గడుస్తున్నా ఇంతవరకూ ఆయన నుంచి కోటి రూపాయలు ప్రభుత్వానికి అందకపోవడం గమనార్హం. అసలు ప్రకారం ఎవరు చేయమన్నారు..? ఎందుకు ఎగ్గొట్టి ఇలా లేనిపోని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది..? అనేది జగన్ రెడ్డికే తెలియాలి.
బాబోయ్.. భరించలేం!
వరద వచ్చి ఎన్ని రోజులు అయ్యింది.. ఇప్పుడు బాధిత ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది..? ఇప్పటికీ ప్రకటించిన కోటి రూపాయలు ఇవ్వకపోవడం ఏంటి..? పోనీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కాకుండా నేరుగా బాధితులకు అందేలా ఏమైనా సహాయ కార్యక్రమాలు చేశారా..? అలా చేసినట్టు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. ఆ మధ్య నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు ఏదో హడావుడి చేసింది వైసీపీ. కొంపదీసి కోటి రూపాయలు దానికే పెట్టలేదు కదా..? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక ఈ కోటి ప్రకటనను సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకూ అందరూ దీన్ని ఓ రేంజిలో పదే పదే గుర్తు చేసి మరీ గట్టిగా ఇచ్చి పడేస్తున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, విమర్శకులు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు చూస్తే అబ్బో మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం అంతే. ఇప్పటికైనా పోయేదేమీ లేదు కదా జగన్.. ఆ కోటి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇవ్వండి లేదంటే ఇవ్వలేను అని.. ఇదీ కాదంటే పార్టీ తరపున పలానా చేశామని చెబితే సరి.. ఎందుకు ఇన్ని విమర్శలు, తిట్లు అవసరమా ఒకసారి యోచన చేస్తే మంచిది మరి..!