అవును అంతా అనుకున్నట్టే జరిగింది.. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ రాజీనామాతో ఒక్కసారిగా పార్టీలో కలకలం రేగింది. వాస్తవానికి ఈయన వైసీపీ రాజీనామా చేసి.. జగన్ రెడ్డికి దూరం కానున్నారని ఎప్పటినుంచో వార్తలు గుప్పుమన్నాయి. అనుకున్నట్టే బుధవారం నాడు బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పేసారు. జనసేనలో చేరేందుకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది.
బంధాల్లేవ్.. బంధుత్వాల్లేవ్!
వైఎస్ జగన్ రెడ్డికి బాలినేని వరుసకు మేన మామ అవుతారు. ఐతే.. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేకుండా పోయింది. దీంతో అల్లుడితో బంధాలు, అనుబంధాలు.. బంధుత్వాలు అస్సలు వద్దు.. ఇక రాజీనామా చేయడమే తరువాయి అని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇక బండలు, బంధుత్వాలు అన్నీ పక్కనెట్టేసి పార్టీని వీడారు బాలినేని. ఐతే.. ఈ మధ్యనే తాడేపల్లి ప్యాలస్ వెళ్లిన బాలినేని సుమారు అరగంటకు పైగా అధినేతతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి మరింత గ్యాప్ వచ్చింది.
వద్దు బాబోయ్..!
నాటి కాంగ్రెస్ నుంచి నేటి వైసీపీ వరకూ వైఎస్ ఫ్యామిలీతోనే బాలినేని ఉన్నారు. అప్పుడూ.. ఇప్పుడూ బాలినేనికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు కానీ.. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ అల్లుడితో మామకు లాంగ్ గ్యాప్ వచ్చేసింది. దీనికి కర్త, కర్మ, క్రియ వైవీ సుబ్బారెడ్డి అన్నది జగమెరిగిన సత్యమే. ఇది ఇప్పుడేం కొత్త కాదు.. పార్టీ ఆవిర్భావం నుంచి నడుస్తున్నదే. ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో వైసీపీని వీడాలని బాలినేని భావిస్తున్నారు.
ప్రకాశం.. జీరో!
బాలినేని అంటే ప్రకాశం.. ప్రకాశం అంటే బాలినేని అన్నట్టుగా ఇన్నాళ్ళు పరిస్థితి ఉండేది. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు బాలినేని లేరు గనుక.. ప్రకాశం జిల్లాలో వైసీపీని వదులుకోవాల్సిందే.. జీరో అవ్వడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా.. వాస్తవానికి బాలినేని అసంతృప్తిగా ఉండటం ఇప్పుడేమీ కొత్త కాదు. చీటికీ మాటికి అలగడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మిన్నకుండిపోవడం చాలా రోజులుగా జరుగుతున్నదే. ఐతే.. వైసీపీ హయాంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంతో ఇది మరింత ఎక్కువ అయ్యింది. నాడు మొదలైన అసంతృప్తి ఇప్పుడు రాజీనామా వరకూ వెళ్లింది. ఇప్పుడు బాలినేని ఏం చేయబోతున్నారు..? ఏ పార్టీలో చేరబోతున్నారో చూడాలి మరి.