నేను ఒక ఐటీ కంపెనీ రన్ చేస్తున్నా.. నాకు తెలిసిన చాలా మంది ఐటీ కంపెనీ ఓనర్లు వివిధ దేశాల్లో ఉన్నారు.. వాళ్ల అందరితో నేను మాట్లాడాను.. 2024లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తారు.. ఆయన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కనీసం 80 నుంచి 100 కంపెనీలు తెచ్చి 5వేల మందికి ఉద్యోగాలు ఇస్తా.. ఇందుకు సంబంధించి క్లస్టర్ నేను రెడీ చేశాను.. ఇవీ ఎన్నికల ముందు నెల్లిమర్ల నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగ మాధవి ఇచ్చిన వాగ్దానాలు. మేడం ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. పవన్ అనుకున్నట్టుగానే కూటమి కూడా అధికారంలోకి వచ్చేసింది. మాధవి ఇచ్చిన హామీలు మాత్రం అస్సలు నెరవేరలేదు. దీంతో మేడంను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు జనాలు.
ఎందుకు ఏమైంది..?
మాటిచ్చి 100 రోజులు అయ్యింది.. కూటమి అధికారంలోకి వచ్చి కూడా 100 రోజులు దాటింది. ఐతే అనుకున్నట్టుగా 80 నుంచి 100 కంపెనీలు మాత్రం నెల్లిమర్లకు రాలేదు. దీంతో.. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాత వీడియోను ఓ రేంజిలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు, వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు. వంద రోజులు దాటిన నేపధ్యంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి మేడం అని నియోజకవర్గ ప్రజలు సైతం నిలదీస్తున్న పరిస్థితి. మరికొందరు ఐతే.. రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రాఫిక్స్ నగరాలుగా.. అమరావతి, నెల్లిమర్లలను అంతరీక్ష కేంద్రం ఎంపిక చేసిందని ఒక్కటే సెటైర్లు పేల్చుతున్నారు.
రోడ్లు వేయండి మహాప్రభో!
నెల్లిమర్లలో 100 కంపెనీల సంగతి దేవుడెరుగు.. పాడైన రోడ్లు వేయండి మహాప్రభో అని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. మొదట రోడ్లు.. ఆ తర్వాతే ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఉద్యోగాలు అంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఐతే.. ఎన్నికల ముందు తెగ హడావుడి చేసిన మాధవి గెలిచిన తర్వాత కనీసం మీడియా ముందుకు వచ్చిన సందర్భాలే లేవు. ఇకనైనా జనాల్లోకి వచ్చి పరిస్థితి ఏమిటి..? కంపెనీల కథ ఎంత వరకూ వచ్చిందో..? కనీసం నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా మేడం జనాల్లోకి వచ్చి వారికి ఏం కావాలో తెలుసుకోవాలి..? కంపెనీలు తర్వాత సంగతి నియోజకవర్గ ప్రజలకు కావాల్సినవి ఏమిటీ..? అనే విషయాలపై ప్రత్యేక దృష్టి పెడితే మంచిది మరి.