ఆస్ట్రాలజర్ వేణు స్వామికి నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వేణు స్వామిపై వెంటనే కేసు నమోదు చెయ్యాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. రీసెంట్ గా వేణు స్వామి అతని భార్య వీణ శ్రీవాణి జర్నలిస్టులను, ముఖ్యంగా టీవీ 5 మూర్తి తమను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు అడుగుతున్నారంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. దానితో టీవీ5 మూర్తి కోర్టుని ఆశ్రయించాడు.
జాతకాల పేరు చెప్పి ప్రజలను, అమాయకులను వేణు స్వామి మోసం చేస్తున్నారని.. ప్రధానమంత్రి ఫోటోను కూడా మార్ఫింగ్ చేసి మాయమాటలతో నమ్మించి తప్పుదోవ పట్టించారంటూ నాంపల్లి కోర్టులో మూర్తి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వేణు స్వామి చేస్తున్న మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ కుట్రపన్నారని పిటిషన్‌లో మూర్తి ఆరోపించారు.
నాంపల్లి కోర్టులో పిటిషనర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించటమే కాకుండా వేణు స్వామిపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీసులు వేణుస్వామిపై కేసు నమోదు చేయనున్నారు.