కామ్రేడ్ కన్నుమూశారు..! ఎర్ర సైన్యానికి అన్నీ తానై ఇన్నాళ్లు ఉన్న ఏచూరి ఇకలేరు..! సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా ఊపిరితిత్తులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. రాజ్యసభ ఎంపీగా సుదీర్ఘకాలం ఏచూరి పనిచేశారు. ఇన్నాళ్లు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ సీపీఐ, సీపీఎం పార్టీలు బతికి ఉన్నాయంటే దానికి ఒకే ఒక్కరు కారణమని ఎర్రదండు చెబుతూ ఉంటుంది. ఏచూరి ఇక లేరని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మరణంపట్ల తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులతో పాటు.. యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు తీవ్ర సంతాపం తెలుపుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
కాగా.. ఏచూరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తే. స్వస్థలం కాకినాడ, పూర్తిపేరు ఏచూరి సీతారామారావు. 1952 ఆగస్టు 12న చెన్నైలో సీతారాం ఏచూరి జన్మించారు.1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ఏచూరి.. ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్ కందాకు ఏచూరి మేనల్లుడు. ఇంద్రాణి మజుందార్‌తో సీతారాం ఏచూరికి వివాహం అయ్యింది. ఏచూరికి కూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్ ఏచూరి ఉన్నారు.
జర్నలిస్ట్ సీమా చిస్తీని ఏచూరి రెండవ వివాహం చేసుకున్నారు. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో కొడుకు ఆశిష్ చనిపోయారు. అప్పట్నుంచే డీలా పడిపోయిన ఆయన.. ఆ బాధ నుంచి కోలుకోలేకపోయారు. ఓవైపు వయసు మీద పడుతుండటం.. ఇంకోవైపు అనారోగ్యానికి గురైన ఏచూరి ఆగస్టు-19న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరి.. తుది శ్వాస విడిచారు.