వైసీపీకి బాలినేని గుడ్ బై..!
వైసీపీకి మరో ఊహించని షాక్ తగలనుందా..? వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అయ్యారా..? బంధాలు, అనుబంధాలు.. బంధుత్వాలు అస్సలు వద్దు.. ఇక రాజీనామా చేయడమే తరువాయి అని ఫిక్స్ అయ్యారా..? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమే అనిపిస్తోంది.
బై.. బై అంటున్న బాలినేని..
ఇదిగో ఆయన మరెవరో కాదండోయ్ బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్ రెడ్డికి బాలినేని వరుసకు మామ అవుతారు. నాడు కాంగ్రెస్ నుంచి నేటి వైసీపీ వరకూ వైఎస్ ఫ్యామిలీతోనే ఉన్నారు. అప్పుడూ.. ఇప్పుడూ బాలినేనికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు కానీ.. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ అల్లుడితో మామకు లాంగ్ గ్యాప్ వచ్చేసింది. దీనికి కర్త, కర్మ, క్రియ వైవీ సుబ్బారెడ్డి అన్నది జగమెరిగిన సత్యమే. ఇది ఇప్పుడేం కొత్త కాదు.. పార్టీ ఆవిర్భావం నుంచి నడుస్తున్నదే. ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో వైసీపీని వీడాలని బాలినేని భావిస్తున్నారట.
ఇక వద్దులే..
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒకటి రెండు రోజుల్లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్య అనుచరులు, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలకు బాలినేని ఫుల్ క్లారిటీగా చెప్పేసారు. బుధవారం రోజు అధినేత జగన్ రెడ్డిని కలిసిన బాలినేని సుమారు అరగంట పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. అయినప్పటికి అసంతృప్తిగానే చర్చలు ముగిసినట్టుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే ఇక పార్టీ అవసరం బాలినేనికి.. బాలినేని అవసరం వైసీపీకి లేదని అటు.. ఇటు ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే వైసీపీని వీడాలని సీనియర్ నేత నిర్ణయించుకున్నారట. అందుకే అభిమానులు, కార్యకర్తలు, అనుచరులకు నోటి మాట ద్వారా విషయం తెలియజేసారట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రకాశం జిల్లాలో వైసీపీని వదులుకోవాల్సిందే.. జీరో అవ్వడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జనసేనలోకి..!!
వాస్తవానికి బాలినేని అసంతృప్తిగా ఉండటం ఇప్పుడేమీ కొత్త కాదు. చీటికీ మాటికి అలగడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మిన్నకుండిపోవడం చాలా రోజులుగా జరుగుతున్నదే. ఐతే.. వైసీపీ హయాంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంతో ఇది మరింత ఎక్కువ అయ్యింది. పోనీ మంత్రి పదవి లేదు కనీసం జిల్లాలో అయినా పలుకుబడి ఏమైనా ఉందా అంటే కనీసం జిల్లా ఎస్పీ, సీఐలను మార్చుకోలేని పరిస్థితి. ఇది పుండు మీద కారం చల్లినట్టుగా అయ్యింది. 2024 ఎన్నికల్లోనూ అసంతృప్తిగానే పోటీ చేసి, ఓడిపోయారు. ఇక ఈవీఎంలో పొరపాట్లు జరిగాయని చెబుతూ వస్తున్న బాలినేనికి చివరికి ఏమీ న్యాయం జరగలేదు. పైగా పార్టీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీలో ఉండటం అవసరమా అనుకున్న ఆయన చివరిగా అల్లుడిని కలిసినా ప్రయోజనం లేకపోయింది. అందుకే ఇక త్వరలోనే జనసేన కండువా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంత..? వైసీపీ ఎలాంటి నిర్ణయమం తీసుకోనుంది అనేది వేచి చూడాలి మరి.