అవును.. ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై వైసీపీ-టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. మొత్తం మీరే చేశారని టీడీపీ అంటుంటే.. చేసింది మీరు పేరు మాకా..? అని రివర్స్ ఎటాక్ చేస్తోంది వైసీపీ. సరిగ్గా ఈ పరిస్థితుల్లో మీడియా ముందుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.. ప్రకాశం బ్యారేజీ కూల్చడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేశారనే సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయానా సీఎం ఈ ఆరోపణలు చేయడంతో అగ్గిగి ఆజ్యం పోసినట్లుగా అయ్యింది. జగన్ ఎందుకిలా చేయడానికి ప్రయత్నాలు చేశారనే దానిపై ఓ వైపు సీఎం.. మరోవైపు యువనేత, మంత్రి నారా లోకేష్ పెద్ద థియరీనే చెప్పుకొస్తున్నారు. ఇంతకీ సీఎం, ఆయన తనయుడు ఏమంటున్నారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి మరి.
అవును ఆయనే..!
బుడమేరు దెబ్బకు విజయవాడ విలవిల్లలాడుతున్న సమయంలో.. ప్రకాశం బ్యారేజీ 67,68,69 గేట్లను నాలుగు భారీ పడవలు వచ్చి ఢీ కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బ్యారేజీ కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. అయితే ఇదంతా వైఎస్ జగన్ పనేనని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. బ్యారేజీపైకి పడవులు పంపించి కూల్చేయాలని ఆయన ప్లాన్ చేశారంటూ ఆరోపించారు. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని.. ఆ బోట్లు అన్నీ వైసీపీ నేతకు సంబంధించనవేనన్నారు. తొలుత బుడమేరుకి గండ్లు పెట్టారు? ఆ తర్వాత ఇలా బ్యారేజీని డ్యామేజీ చేయాలని చూశారు..? అసలు ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? అని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు బాబు. అంతేకాదు.. ఇంత చేసిన వాళ్లే తిరిగి టీడీపీపై విషం చిమ్మడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామనే ఆక్రోశంతో ఇష్టానుసారం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని చంద్రబాబు కన్నెర్రజేశారు. ఇక జగన్ విజయవాడ బాధితులను పరామర్శించడంపైనా ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాధితుల్ని పరామర్శించడానికి వచ్చిన జగన్ ఒక్కటంటే ఒక్క ఫుడ్ ప్యాకెట్, కనీసం పాల ప్యాకెట్ ఇచ్చారా? అని ముఖ్యమంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు.
అదే జగన్ టార్గెట్..
ఈ వ్యవహారం ఇలా రాజకీయ రంగు పులుముకుంటున్న పరిస్థితుల్లో యువనేత, మంత్రి నారా లోకేష్ మీడియా ముందుకొచ్చి.. మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాశం బ్యారేజిని కూల్చి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలనేది జగన్ లక్ష్యమని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం.. అన్నమయ్య డ్యామ్‌ను కొట్టుకుపోయేలా చేసి ప్రాణ నష్టానికి కారణమయ్యారని విషయాన్ని ఉదహరించి మరీ చెప్పారు లోకేష్. 50 మందిని చంపేసి, ఐదు గ్రామాలను నామరూపాల్లేకుండా చేసిన జగన్.. ఇప్పుడు ప్రకాశం బ్యారేజిని ఇనుప పడవలతో ఢీకొట్టి కూల్చాలన్ని కుట్ర చేశారని ఆరోపించారు. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలను నామరూపాల్లేకుండా చేయాలన్న సైకో జగన్ కుట్ర బయటపడిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజలను జలసమాధి చేయాలన్న కుట్రకు ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే.. ఆ ప్రణాళికను అమలు చేసింది తలశిల రఘురాం, నందిగం సురేశ్ అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. చూశారుగా.. ఇదీ టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ పడవలు ఎవరివి అనేది ఇప్పటికే బయపడింది.. ఇద్దర్ని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి మరి.