Advertisement
TDP Ads

పవన్.. పిఠాపురానికేనా మంత్రి?

Tue 10th Sep 2024 01:29 PM
pawan kalyan  పవన్.. పిఠాపురానికేనా మంత్రి?
Is Pawan a minister for Pithapuram? పవన్.. పిఠాపురానికేనా మంత్రి?
Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయారా..? అధినేత కాస్త డిప్యూటీ సీఎం అయ్యాక పరిస్థితులు మారిపోయాయా..? అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా ప్రవర్తిస్తున్నారా..? అంటే సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతున్న మాటలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజం అనిపిస్తోంది. ఇంతకీ సేనానికి ఏమైంది..? ఎందుకీ ప్రవర్తన..? సొంత మనుషులు ఏమంటున్నారు..? ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఏమంటున్నారు..? అనే విషయాలు చూసేద్దాం రండి.

ఒక్కటే ట్రోలింగ్స్!

భారీ వర్షాల దెబ్బకు విజయవాడ విలవిల్లాడిన పరిస్థితులు మనం పదిరోజులుగా చూస్తూనే ఉన్నాం. మీడియా, సోషల్ మీడియాలో ఎటు చూసినా హృదయ విధారక దృశ్యాలే. అన్నమో రామచంద్రా అని చిన్నారులు మొదలుకుని ముదుసలి వరకూ తీవ్ర ఇక్కట్లు పడిన పరిస్థితి. కనీసం తాగడానికి గుక్కెడు నీళ్ళు ఐనా ఇచ్చి కాపాడండి అని ఆహాకారాలు. ఐతే.. సీఎం చంద్రబాబు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల కష్టాలు తెలుసుకొని వెన్నంటి నిలిచారు.. కనీసం పవన్ పట్టించుకోలేదు అన్నది టీడీపీ శ్రేణులు కొందరు సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్న పరిస్థితి. దీన్ని పట్టుకుని వైసీపీ కార్యకర్తలు రంగంలోకి దిగి మీరు మీరు కొట్టుకొని మమల్ని ఎంటర్ టైన్ చేయండి అంటూ నవ్వుకున్నారు. ఇక జనసేన కార్యకర్తలు కొందరు కూడా పవన్ ఎందుకు రాలేదు..? అని ప్రశ్నిస్తున్నారు.

ఫ్యాన్స్ ఎవరికి లేరు..?

ఒకానొక సందర్భంలో ఈ ట్రోలింగ్ పై పవన్ స్పందిస్తూ నేను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుంది.. అభిమానుల తాకిడికి ఇబ్బంది అవుతుంది అని వివరణ ఇచ్చుకున్నారు కూడా. ఐనా సరే.. మీకు ఒక్కరికేనా అభిమానులు ఉండేది.. చంద్రబాబుకు.. వైఎస్ జగన్ రెడ్డికి లేరా అంటూ మరిన్ని విమర్శలు వచ్చాయి. ఐనా వరదలకు ఇబ్బంది పడుతున్న, అల్లకల్లోలంగా ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలవడానికి పరుగులు పెడతారా ఏంటి..? అని ప్రశ్నిస్తున్న వాళ్ళూ ఉన్నారు. అవన్నీ పట్టించుకోకుండానే పవన్ మాత్రం.. వరదలపై రివ్యూ మీటింగ్స్, టెలిఫోన్ కాన్ఫిరెన్స్ అంటూ బిజిబిజీగానే గడిపారు.

విజయవాడ వద్దా..?

ఇవన్నీ అటుంచితే.. పవన్ విజయవాడకు రాలేదు సరే.. అక్కడితో సైలెంట్ అయ్యి ఉంటే సరిపోయేది ఏమో.. సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్లి వరద బాధితులను పరామర్శించడంతో ఒక్కటే విమర్శలు.. ఏకంగా కులంను పట్టుకొని మరీ తిడుతున్న పరిస్థితి. ఇవన్నీ చేస్తున్నది మరెవరో కాదు.. టీడీపీ వాళ్ళే కావడం గమనార్హం. ఇక వైసీపీ ఏమీ తక్కువ కాదనుకోండి. వరద ముంపులో తీవ్ర ఇబ్బందులు పడ్డ విజయవాడ నగర ప్రజలను గాలికి వదిలేసారు..? ఎందుకనీ..? విజయవాడ నగర ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి పవన్ కళ్యాణ్? మీ క్యాంపు కార్యాలయం కూడా విజయవాడ నగరంలోనే ఉంది కదా..? అని ప్రశ్నిస్తున్నారు ప్రత్యర్థి నేతలు.

వైసీపీ ఇలా..!

నేను వస్తే జనాలు వస్తారు సహాయకు చర్యలకి ఆటంకం ఏర్పడుతుందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.. కానీ పిఠాపురంకు వరదలు వస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్లి బురదలో నడిచి, బోటులో పర్యటన కూడా చేస్తారు.. ఇక్కడ ప్రజలు ఎవరూ మీ మీద పడలేదు సహాయకు చర్యలకు ఇబ్బంది రాలేదు..? కదా అని ప్రశ్నిస్తున్నారు. బుడమేరు ముంపు వలన విజయవాడ నగరంలో లక్షల కుటుంబాలు రోడ్లు పాలైన, వందల వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిన, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన మీరు మాత్రం ఒక్క ప్రాంతాన్ని సందర్శించలేదు, ఒక్కరిని పరామర్శించలేదు.. ఎందుకనీ..? విజయవాడ నగర ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు.. చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది అని వైసీపీ నేతలు కొందరు శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి. ఐనా.. పక్కనే విజయవాడ కదా ఒకసారి వెళ్లి వస్తే సరిపోయేది కదా.. ఎందుకు వచ్చిన తలనొప్పి..? వరద బాధితులకు విరాళం ఇవ్వడం ఓకే కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి వెళ్లకపోవడం ఏంటో అని జనసేన నేతలు, కార్యకర్తలు కొందరు నిట్టూరుస్తున్నారు. మరి.. ఈ వ్యవహారాన్ని పవన్ ఎలా తీసుకుంటారు..? ఎలా రియాక్ట్ అవుతారు..? అనేది వేచి చూడాలి మరి.

Is Pawan a minister for Pithapuram?:

Netizens trolls on Pawan Kalyan 

Tags:   PAWAN KALYAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement