ఎవరీయన.. ఇలా అయ్యారేంటి..!?
ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా..? కనీసం ఎక్కడైనా చూసినట్లు అయినా అనిపించిందా..? పోనీ ఎక్కడో చూసినట్టే ఉంది కానీ పేరు, ముఖం గుర్తుకు రావట్లేదా..? కొంత మందికి టక్కున గుర్తు వచ్చి ఉండొచ్చు.. మరికొంత మందికి ఆలస్యంగా అయినా గుర్తు పట్టారు కదా..! సరే ఇక ఆగండి నేనే చెప్పేస్తానులే.. ఆయన మరెవరో కాదండోయ్ జేసీ దివాకర్ రెడ్డి.. ఇప్పుడు గుర్తొచ్చింది కదా.. ఇదీ అసలు సంగతి.
అప్పుడు.. ఇప్పుడు!
జేసీ దివాకర్ రెడ్డి.. ఈయన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడే. ఆంధ్రప్రదేశ్‌లో, మరీ ముఖ్యంగా సీమ రాజకీయాల్లో.. అనంతపురం జిల్లాలో అయితే జేసీ బ్రదర్స్ అంటే ఆ లెక్కే వేరు. ఫ్యాక్షన్ అయినా.. పాలిటిక్స్ అయినా.. బిజినెస్ అయినా జిల్లాలో వీరి తర్వాతే ఎవరైనా అన్నట్లుగా అప్పట్లో పరిస్థితులు ఉండేవి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ బ్రదర్స్ ఇద్దరూ ఓ వెలుగు వెలిగారు. రాజకీయంగానే కాదు.. ఆర్థికంగా కూడా బలమున్న బ్రదర్సే. వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగు కావడంతో తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంది జేసీ ఫ్యామిలీ. సైకిల్ పార్టీలోనూ ఇదివరకు అంత కాదులే కానీ గట్టిగానే తిరిగారు. వైసీపీ హయాంలో నానా ఇబ్బందులు పడ్డారు బ్రదర్స్. వాహనాల కుంభకోణం, మైనింగ్స్ ఇలా ఇక్కట్లు వచ్చాయి. అయినా సరే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవిని జేసీ ప్రభాకర్ రెడ్డి దక్కించుకుని.. నియోజకవర్గాన్ని ఏలారు. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు జేసీ బ్రదర్స్ అండ్ సన్స్.
ఆయనే.. ఈయన!
ఇక అసలు విషయానికొస్తే.. జేసీ బ్రదర్స్ ఇద్దరూ ఒకరికి మించి మరొకరే కానీ ఎవరూ ఇసుమంత కూడా తగ్గరు. ఇక.. దివాకర్ రెడ్డి మీడియా ముందుకు వస్తే తన, మన అని తేడా లేకుండా ఆగ్రహంతో ఊగిపోతూ.. ఎవర్నీ వదలకుండా గట్టిగా ఇచ్చిపడేస్తుంటారు. అధికారం ఉన్నా లేకున్నా సరే ఈయన ఇంతే. ఇలా మాట్లాడి లేనిపోని తలనొప్పులు కూడా తెచ్చుకున్నారు దివాకర్. అయితే.. ఇప్పుడు ఆయన వయసు రీత్యా చాలా మారిపోయారు. ఇదిగో ఈ ఫొటోలు ఉన్నట్లుగా ఇప్పుడు ఉన్నారు. ఒక్కసారి గూగుల్‌లో కొడితే జేసీ దివాకర్ రెడ్డి.. ఆ గ్లాసెస్, గంభీరం, ఠీవీ వేరు. కానీ ఇప్పుడు ఎవరూ గుర్తు పట్టనంతగా అయ్యారు. వయసు మీద పడటం, ఆరోగ్యం సహకరించకపోవడంతో పూర్తిగా డీలా పడిపోయారు.
ఎందుకు.. ఏమైంది..?
జ్ఞాపక శక్తి తగ్గడంతో పాటు నడవడం కూడా ఇబ్బందిగా అయ్యిందని దివాకర్ అనుచరులు, అభిమానులు చెబుతున్నారు. ఇదిగో కుమారుడు జేసీ పవన్ రెడ్డి మనవడితో కలిసి దిగిన ఫొటో.. తన సోదరుడి ఫొటోను జేసీ ప్రభాకర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఈ పోస్టుకు అభిమానులు షాకవుతూ రిప్లయ్‌లు ఇస్తుండగా, విమర్శకులు సైతం పాజిటివ్‌గానే కామెంట్స్ చేస్తున్నారు. జేసీ తాతేంటి.. కోటా శ్రీనివాస్ లాగా అయిపోయారు. గెట్ వెల్ సూన్ సార్ అంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు. ఓహో అందుకేనా ఆయన ఉన్న టీడీపీ గెలిచినా మీడియా ముందుకు రాలేదు.. ఎంతైనా సీమ రాజకీయాల్లో ఈయనో తోపు, తురుం అంతే అని రాయలసీమ వాసులు ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే.. 80వ పడిలోకి రెడ్డిగారు పడ్డారని అందుకే ఇంత వీక్ అయ్యారని చెప్పేవాళ్లూ ఉన్నారు. ఏదైతేనే.. ఇలా గుర్తు పట్టలేనంత అయినందుకు అభిమానులు, అనుచరులు.. తెలుగు తమ్ముళ్లు ఒకింత బాధపడుతున్నారు.