డబ్బులొద్దు.. ఫ్రీ అంటున్న హోం మినిస్టర్!
అబ్బే.. అదేం లేదు.. అంతా తూచ్..! నేను గత ప్రభుత్వ జీవోను చదివేశా.. సీఎం నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయద్దని చెప్పారు.. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా మీరు కట్టనక్కర్లేదు.. వైసీపీ వారికి పని లేక ట్రోల్ చేస్తున్నారు.. ఇవీ వినాయక చవితి మండపాల విషయంలో వచ్చిన ట్రోలింగ్స్‌పై హోం మంత్రి వంగలపూడి అనిత ఇచ్చుకున్న వివరణ. దీంతో మునుపటికి మించి ట్రోల్ అవుతున్నారు హోం మినిస్టర్. అనితక్కా.. తమరు హోం మినిస్టరా..? లేక కాపీ పేస్ట్ మినిస్టరా..? అంటూ మరోసారి ట్రోలింగ్ అవుతున్నారు.
ఏం జరిగింది..?
ఆంధ్రప్రదేశ్‌లో గణేష్ మండపాలకు సింగల్ విండో విధానంను కూటమి సర్కార్ అమలు చేసిన సంగతి తెలిసిందే. మైక్ పర్మిషన్‌కు రూ. 100, ఎత్తును బట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు 3 నుంచి 6 అడుగుల వాటికి రూ. 350.. 6 అడుగులు దాటితే రోజుకు 700 రూపాయిలు చెల్లించాల్సిందేనని నిబంధనలు విధించారు హోం మంత్రి. అయితే.. ఫర్ డే, చలాన్లు ఇవన్నీ మీ సేవా కేంద్రల్లో కట్టొచ్చని అనిత స్పష్టం చేశారు. అయితే వినాయక చవితికి.. అది కూడా హిందువుల పండుగకు డబ్బులు కట్టించుకోవడం ఏంటి..? అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బాబోయ్.. ఈ వ్యవహారం చాలా దూరం వరకూ వెళ్లింది. మతాల మధ్య ఈ చిచ్చు ఏంటి అంటూ హిందూ ధార్మిక సంస్థలు సైతం స్పందించిన పరిస్థితి. దీంతో అసలే వరదల విషయంలో నానా రచ్చ జరుగుతుండగా ఈ వివాదం ఒకటి వచ్చి పడటంతో కూటమి సర్కార్ సరిచేసుకుంది.
వద్దు బాబోయ్.. వద్దు!
ఎవరితో అయితే.. ఈ జీవోను ప్రభుత్వం చదివించిందో.. అదే మంత్రితో మళ్లీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. నేను గత ప్రభుత్వ జీవో చదివేశాను.. సీఎం చంద్రబాబు గారి దృష్టికి వెళ్లిన తర్వాత ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయద్దని చెప్పారన్నారు. ఈ గ్యాప్‌లోనే వైసీపీ కార్యకర్తలు, నేతలు వారికి పని లేక ట్రోల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సో.. ఇప్పుడు వినాయక మండపాల నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తీసుకోదన్న మాట. మరి ఇప్పటి వరకూ చెల్లించిన వారి పరిస్థితి ఏంటి..? రిటర్న్ ఇచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా..? అంటే దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా లక్షల రూపాయిలు చలాన్ల రూపంలో ప్రభుత్వానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఆ నగదు అంతా రీఫండ్ చేస్తారో లేదో చూడాలి మరి.