ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు నిజంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై పగ పట్టారేమో..? అయితే అంతా ఓకే.. లేదంటే అడ్డంగా బుక్ చేసేస్తున్నారు..!విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు నగరం కాస్త విలయవాడగా మారిపోయింది. బుడమేరు దెబ్బకు బెజవాడ గజ గజా వణికిపోయి.. వేలాది మంది ప్రజలు రోడ్డున పడిన పరిస్థితి. సహాయక చర్యలు సర్లేవని.. ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదని జనాలు కన్నెర్రజేస్తున్న పరిస్థితి. అధికారులు ఏం చేస్తున్నారు..? ఎందుకింత నిర్లక్ష్యం అంటూ స్వయంగా సీఎం కన్నెర్రజేసిన పరిస్థితి. నిత్యావసరాల సరఫరాలో కూడా నిర్లక్ష్యం సహించని సీబీఎన్.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కే క్లాస్ తీసుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ ఆర్పీ సిసోడియా చేసిన కామెంట్స్.. సీబీఎన్‌ను అడ్డంగా ఇరికించేసినట్లు అయ్యింది.
ఓరి బాబోయ్.. ఏంటిది?
అసలే వరదల విషయంలో టీడీపీ కూటమి-వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముంచింది మీరేనని టీడీపీని వైసీపీ విమర్శిస్తుంటే.. రిటర్నింగ్ వాల్‌తో కాపాడింది మేమేనని వైసీపీ గర్వంగా ఫీలవుతూ చెబుతోంది. ఇలా మాటల యుద్ధం నడుస్తున్న వేళ.. విజయవాడకు వరదలు వస్తాయని ఒకరోజు ముందే తెలుసని సిసోడియా బాంబ్ పేల్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. 2 లక్షలకుపైగా కుటుంబాలను తరలించడం సాధ్యం కాదని.. పునరావాస కేంద్రాలకు వెళ్లమంటే ఇక్కడైనా (విజయవాడ), లంక గ్రామాల్లో అయినా వెళ్లడానికి ఇష్టపడరని.. అందుకే వారిని బలవంతంగా తరలించడం కష్టతరమన్నారు. చూశారుగా.. అసలే వరదలను మేనేజ్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్న చంద్రబాబును సిసోడియా తన మాటలతో అడ్డంగా ఇరికించేశారు.
చెప్పడం మీ వంతేగా..!
ప్రజలను తరలించడం సాధ్యం కాదు సరే.. మీడియా, సోషల్ మీడియా.. మైకుల ద్వారా ప్రకటనలు, హై అలర్ట్ ప్రకటిస్తే కనీసం ప్రాణాలు అయినా కాపాడుకునే వారు కదా. ప్రభుత్వం ఈ పని ఎందుకు చేయలేదు..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటి వరకూ కరకట్టలో ఉన్న తన ఇంటిని కాపాడుకోవడానికి.. అమరావతి రియల్ ఎస్టేట్‌ను కాపాడుకోవడానికే బుడమేరను ఇలా మళ్లించారని.. చంద్రబాబే ఇదంతా చేశారని వైసీపీ చేసిన ఆరోపణలకు.. ఎక్కడో సింక్ అవుతోందని సామాన్య ప్రజలు సైతం అనుమానిస్తున్న పరిస్థితి. మరోవైపు.. వెలగలేరు డీఈ మాధవ్ నాయక్ కూడా ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. వరద వస్తుందని ఉన్నతాధికారులకు వరద వస్తుందని ముందే చెప్పామన్నారు. అటు సిసోడియా.. ఇటు మాధవ్ చేసిన కామెంట్స్ కూటమి సర్కార్‌ను అడ్డంగా బుక్ చేసేశాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నే అదునుగా చేసుకున్న వైసీపీ ఇప్పటికైనా నమ్ముతారా ఇదంతా మ్యాన్ మేడ్ అని అంటూ దుమ్మెత్తి పోస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై కూటమి ఎలాంటి ప్రకటన చేస్తుందో ఏంటో చూడాలి మరి.