హైడ్రా వద్దులే.. మేమే కూల్చేస్తాం!
ఆక్రమణ నిజమే.. మేమే కూల్చేస్తాం!
అవును.. హైడ్రా వద్దులే.. మేమే కూల్చేస్తాం! అంటూ జయభేరీ కన్‌స్ట్రక్షన్స్ యజమాని, టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ స్పష్టం చేశారు. చెరువు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని నిర్ధారించిన హైడ్రా శనివారం నాడు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన.. ఆక్రమణ నిజమేనని అయితే అది మూడు అడుగులు మాత్రమేనని వివరణ ఇచ్చుకున్నారు. గత 24 గంటలుగా ఎన్ కన్షెన్షన్ సెంటర్ తర్వాత హైదరాబాద్‌లో మరో భారీ కూల్చివేత జరగబోతోంది. ఎన్ తర్వాత జే (జయభేరి కన్‌స్ట్రక్షన్స్) అంటూ అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు కావడంతో మురళీని టచ్ చేయలేరని.. అవసరమైతే నేరుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి కూల్చివేతలు ఆపేస్తారని మరీ వార్తలు రావడం, మరోవైపు సండే అయినా సరే నాన్ స్టాప్‌గా హైదరాబాద్, నగరం చుట్టు పక్కల భారీగా బిల్డింగులు నేలమట్టం చేస్తున్న తరుణంలో ఎట్టకేలకు మురళీమోహన్ స్పందించారు.
అబ్బే.. మూడే!
మీడియాలో వస్తున్న వార్తలను ఒకింత ఖండించిన మురళీమోహన్.. కేవలం మూడు అడుగుల మేర చెరువు ఆక్రమణ జరిగిందని స్పష్టం చేశారు. అది కూడా అనుకోకుండా జరగిందేనని.. అక్కడేమీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేవని, టెంపరరీగా ఉన్న రేకుల షెడ్డు మాత్రమే ఆ మూడు అడుగుల్లో ఉందని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆ రేకుల షెడ్డును మంగళవారం సాయంత్రంపు తామే కూల్చేస్తామని.. హైడ్రా రానక్కర్లేదని చెప్పుకొచ్చారు. 33 ఏళ్ల రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎప్పుడూ.. ఎక్కడా.. ఏనాడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదన్నారు. బఫర్ జోన్‌లో మూడు అడుగుల మేర.. రేకుల షెడ్డు ఉన్నట్టు అధికారులు కూడా గుర్తించి నోటీసులు ఇచ్చారన్న విషయాన్ని కూడా చెప్పారాయన. మొత్తానికి చూస్తే.. గత 24 గంటలుగా వచ్చిన వార్తలకు ఇలా చెక్ పెట్టేశారు.
నమ్మొచ్చా..!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. అంత పెద్ద రియల్ ఎస్టేట్ కన్‌స్ట్రక్షన్ సంస్థ, అందులోనూ రియల్ రంగంలో రారాజుగా ఉన్న సంస్థ.. కేవలం మూడంటే మూడు అడుగులు ఆక్రమించిందంటే ఎవరైనా నమ్ముతారా..? అని సోషల్ మీడియాలో మురళీ మోహన్ కామెంట్స్‌పై చిత్ర విచిత్రాలుగా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఆ మూడు అడుగులు కూడా రేకుల షెడ్డు.. అబ్బా ఏమన్నా మాటలా..? ఎవరికి సార్ ఈ కాకమ్మ కబుర్లు చెప్పేది..? అంటూ తిట్టిపోస్తున్నారు. సామాన్యుడికో న్యాయం.. సెలబ్రిటీకో న్యాయమా..? అంటూ హైడ్రాను సైతం నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి. నోటీసులు ఇచ్చిన 24 గంటలు తర్వాత ఎందుకు స్పందించాల్సి వచ్చింది..? ఈ గ్యాప్‌లో సారు వారు ఏం చేసినట్లు..? ఎవరితో ఎవరికి ఫోన్ చేసి మేనేజ్ చేశారు..? అని మురళీ మోహన్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయినా మూడు అడుగులే అంటుంటే మీకైనా నమ్మబుద్ధి అవుతోందా.. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!