హైడ్రా.. నాన్ స్టాప్ అంటూ అక్రమార్కుల గుండెల్లో శర వేగంగా పరిగెడుతోంది..! కబ్జాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతుండగా.. ఎప్పుడు ఎవరి ఇంటి మీదికి బుల్డోజర్లు వచ్చి పడతాయో తెలియట్లేదు. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ టెన్షన్ పడిపోతున్నారు. ఎప్పుడైతే హైడ్రా దెబ్బకు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం అయ్యిందో నాటి నుంచి హైదరాబాద్ కాస్త హైడ్రాబాద్ అయ్యింది. ఇక ఇదే హైడ్రాకు సామాన్యుల నుంచి పక్క రాష్ట్ర ప్రభుత్వాల వరకూ పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దీంతో కమిషనర్ ఏవీ రంగనాథ్ తగ్గేదెలా.. ఎవ్వరైనా సరే అంటూ దుమ్ము దులిపి వదులుతున్నారు.
జయభేరిపై హైడ్రా..
టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్‌కు హైడ్రా ఊహించని జలక్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో రారాజుగా వెలుగొందుతున్న జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గల రంగాళ్‌కుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. ఈ నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మించినట్లు హైడ్రా గుర్తించి.. తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే మేమే కూల్చేస్తామని నోటీసుల్లో హైడ్రా హెచ్చరించింది. ఐతే నోటీసులు ఇచ్చి గంటలు గడుస్తున్నా ఇంతవరకూ మురళీమోహన్ స్పందించలేదు. మీడియా వేదికగా కానీ.. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా రియాక్ట్ కాలేదు. దీంతో మౌనానికి అర్థం అంగీకారం.. తప్పు చేసినట్టేనా.. కూల్చివేతలు సమ్మతమే అని అర్థం చేసుకోవచ్చు ఏమో అంటూ విమర్శకులు, నెటిజన్లు గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు.
నాడు.. నేడు..!
జయభేరి.. రియల్ ఎస్టేట్ రంగంలో నంబర్ వన్.. పెద్ద పెద్ద కట్టడాలు, వెంచర్లు, బిల్డర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రాకు సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సైబరాబాద్ సృష్టి జయభేరి సంస్థ కోసమే అన్నది బహిరంగ ఆరోపణ. మురళికి ప్రేమతో చంద్రబాబు అంటూ నాటి నుంచి నేటి వరకూ ఇది నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా హైడ్రా దెబ్బ జయభేరిపై పడింది. ఇప్పటికైతే ఇది సెన్సేషగల్ వార్తే.. పైగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మురళీమోహన్ బాగా కావాల్సిన వ్యక్తి. అలాంటిది తన పలుకుబడి.. రాజకీయం వాడి ఆపుకోగలరు అని అప్పుడే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఒకే ఒక్క ఫోన్ కాల్ ఏపీ నుంచి వస్తే అన్నీ సెట్ అవుతాయన్నది నెటిజన్లు చెబుతున్న మాట. ఐనా రంగనాథ్ గురుంచి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఆయన ఏదైనా ఒక్కసారి అనుకుంటే అంతే సంగతులు. అలాంటిది మురళీ మోహన్ విషయంలో చివరికి ఏమవుతుందో చూడాలి మరి.