వరదల్లో ఏపీతో కేంద్రం దోబూచులాట!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఎంతగా నష్టపోయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బెజవాడ ఐతే గజ గజా వణికిపోయింది. తినడానికి తిండి లేక.. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక.. ఉండటానికి ఇల్లు లేక.. కట్టుబట్టలతో ఇళ్లలో నుంచి బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో సుమారు 40 మందికి పైగానే అసువులు బాసిన పరిస్థితి. ఓ వైపు సహాయక చర్యలు ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పటికీ.. మరోవైపు వర్షం, వరదతో జనాలు తీవ్ర ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. ఎప్పుడు మళ్ళీ వరద వస్తుందో తెలియక బిక్కు బిక్కు మంటూ బతికేస్తున్నారు జనాలు. ఈ పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దగ్గరుండి మరీ పరిస్థితి ఏంటి..? రైతాంగం నష్టపోయిన విధానం.. జనాలు చిగురుటాకులా వణికిపోతున్న వైనాన్ని చూశారు.
మొదట ఇలా..!
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కచ్చితంగా కేంద్రం తనవంతు సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. చేసి తీరాల్సిందే..! అలాంటిది ఇంత వరకూ ఎలాంటి కనీస ప్రకటన రాకపోవడం గమనార్హం. తక్షణ సహాయం అందించడానికి పని జరుగుతోందని.. ఇందులో కేంద్రం వాటా కూడా ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో సంభవించిన అకాల వరదల సహాయ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటనలో వెల్లడి. అటు ఏపీలో.. ఇటు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కేంద్రమంత్రి సామాన్య ప్రజలు, రైతులతో సమావేశమై సమస్యలపై చర్చించారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం పూర్తి సమర్ధతతో పని చేస్తోందని కితాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో.. రెండు తెలుగు రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ నిధి నుంచి నిధులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ. 3,448 కోట్లు కేటాయించినట్లు కీలక ప్రకటన కూడా కేంద్రం చేసేసింది.
అంతా తూచ్..!
హమ్మయ్యా.. కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు అనుకునే లోపే షాకింగ్ న్యూస్ తెలిసింది. ఇదంతా అక్షరాలా ఆపద్దమని స్వయంగా సీఎం చంద్రబాబు మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి. కేంద్ర సాయంపై వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని.. ఇంకా రిపోర్టులే పంపలేదన్నారు. రూ. 3300 కోట్ల సహాయం అంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని కొట్టి పడేసారు. శనివారం ఉదయం కేంద్రానికి వరద సహయం కోసం రిపోర్టు పంపిస్తామన్నారు. చూశారుగా.. సాక్షాత్తూ శివరాజ్ చౌహాన్ ప్రకటనలో చేయడం.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ట్విట్టర్ వేదికగా థాంక్స్ చెబుతూ.. రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు కూడా తెలిపారు. ఐతే.. ఈ లోపే అబ్బే ఇదంతా తూచ్.. దోబూచులాట అని తేలిపోయింది. ఎంతైనా కేంద్రం ఈ పరిస్థితుల్లో అడగక ముందే సాయం చేయాల్సిన.. కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సిన.. అందులోనూ మిత్రపక్షం కావడంతో గట్టిగానే డిమాండ్ చేయాల్సి ఉంది కూడా..! రేపు పొద్దున్న రిపోర్ట్ పంపిన తర్వాత కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుంది..? ఏ మాత్రం సాయం చేస్తుంది అనేది వేచి చూడాలి మరి.