వరద బాధితులకు లోకేష్ ఏం చేశారు!?
విజయవాడ వరద బాధితులకు టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ ఏం చేశారు..? ఇంతవరకూ ఎందుకు కనీసం సాయం చేయడానికి కూడా సాహసించలేదు..? అన్ని కోట్లు ఆస్తులు ఉండి.. మంత్రిగా పనిచేస్తూ ఒక్క రూపాయి ఇవ్వలేదేం..? ఇప్పుడిదే తెలుగుదేశం.. జనసేన కార్యకర్తలు, వీరాభిమానులు మధ్య నడుస్తున్న రచ్చ.. అంతకుమించి చర్చ..!
ఎందుకు.. ఏమైంది!
వరదలతో బెజవాడ గజ గజ వణికిపోయింది..! ఇప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావట్లేదు..! ఎప్పుడు వర్షం పడుతుందో.. వరద వచ్చి ఇబ్బంది పెదుతుందో తెలియక బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి. తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక.. చిన్న పిల్లలకు పాలు లేక.. పెద్దోళ్ళకు కనీసం మెడిసిన్ లేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు జనాలు. ఇక సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు.. ఆర్తనాదాలు చూస్తుంటే హృదయవిదారకమే..! ఇవన్నీ చూసి చలించిపోయిన ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు.. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, పార్టీలకు అతీతంగా నేతలు.. ఆఖరికి సామాన్యుడు సైతం సీఎం రిలీఫ్ ఫండ్ కు తోచినంత సాయం చేస్తున్నాడు.
పవన్.. రియల్ హీరో!
వరద బాధితులకు నేను సైతం అంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ విరాళాలు ప్రకటించారు. ఏపీకి కోటి రూపాయలు.. తెలంగాణకు కోటి.. ఇక వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీలకు నాలుగు కోట్ల రూపాయలు.. ఇలా మొత్తం 6 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పటివరకూ ఇదే హయ్యెస్ట్..! ఇక తన శాఖకు చెందిన ఉద్యోగులు సైతం విరాళం ప్రకటించారు. దీంతో పవన్ రియల్ హీరో.. మనసున్నోడు.. అంటూ అభిమానులు, కార్యకర్తలు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ నారా లోకేష్ ఎందుకు ఒక్క పైసా సాయం చేయట్లేదు..? అని జనసేన శ్రేణులకు పెద్ద అనుమానం వచ్చి పడింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్.. లోకేష్ అభిమానుల మధ్య పెద్ద వార్ జరుగుతోంది.
ఇవ్వరేం చినబాబు..!
వరద భాదితులు సహాయం కోసం కోట్లాది రూపాయిలు సొంత నిధులు పవన్ ఇస్తుంటే.. మంత్రి నారా లోకేశ్ ఎంత ఇచ్చారు? ఒక్క రూపాయి అయినా ఇచ్చారా..? పొత్తు ధర్మం అంటే పవన్ కళ్యాణ్ నుంచీ డబ్బులు వసూలు చేయడమేనా? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఐతే.. విరాళం ఇస్తేనే ప్రజల మీద అభిమానం ఉన్నట్టా..? పట్టించుకున్నట్టా..? లేకుంటే లేనట్టేనా..? అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హెరిటేజ్ నుంచి రావాల్సిన విరాళం వచ్చిందని.. ఇక బుడమేరు మొదలుకుని చెరువుల దగ్గర యువనేత దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇంత చేస్తున్న చినబాబును ఇష్టానుసారం మాట్లాడితే అస్సలు ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్న పరిస్థితి.
ఇది తప్పు కదా..!
ఇవన్నీ అటుంచితే.. పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్ వస్తే దాన్ని కూడా టీడీపీ శ్రేణులు కొందరు రచ్చ చేస్తున్నారు. వరదలో బురదలో తిరిగిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు ఆరోగ్యంగానే ఉన్నారు.. మరీ బయటికి రాకుండా.. కనీసం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకున్నా ఎందుకు.. ఎలా జ్వరం వస్తుంది..? అని లేనిపోని సందేహాలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇది తప్పు కదా. అసలే వర్షాకాలం, దీనికి అటు ఇటు తిరిగితేనే జ్వరాలు వస్తాయి.. ఇంట్లో కూర్చుంటే రావు అనడానికి లేదు. సీజన్ కదా అవి మామూలే. మరోవైపు.. పవన్ అస్తమానూ అనారోగ్యం పాలవుతుంటే ఎలా.. ఆరోగ్యం మీద దృష్టి సారించాలని పవర్ స్టార్ అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. చూశారుగా.. ఎక్కడినుంచి ఎక్కడివరకూ వ్యవహారం వెళ్తోందో.. కాస్త విమర్శలు, ఆరోపణలు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఇప్పుడు అందరూ కూటమిలో కలసికట్టుగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.