ప్రియురాలు పవిత్ర గౌడ కోసం అభిమాని రేణుక స్వామిని అత్యంత పాశవికంగా హత్య చేయించిన కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం బళ్లారి జైల్లో ఉంటే.. పవిత్ర గౌడతో సహా ఈకేసులో మరో 14 మంది జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. దర్శన్ బెంగుళూరు జైల్లో రాచభోగాలు అనుభవిస్తున్న విషయం వైరల్ అవడంతో దర్శన్ ని కర్ణాటక అధికారులు భారీ బందోబస్తు నడుమ బళ్లారి జైలు కి పంపించారు.
అయితే ఇప్పుడు రేణుక స్వామిని చిత్ర హింసలు పెట్టి హత్య చేయించిన ఫొటోస్ బయటపడ్డాయి. రేణుక స్వామి బట్టలు విప్పించి ఓ లారీ ముందు కూర్చోబెట్టి హింసించిన ఫొటోస్, అలాగే రేణుక స్వామి స్పృహ లేకుండా పడిపోయిన ఫోటో బయటపడడంతో రేణుక స్వామి తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.
తన కొడుకుని దారుణంగా హింసించి చంపించిన వాళ్ళను తన కొడుకు కన్నా ఎక్కువగా చిత్ర హింసలు అనుభవించాలని, అలాంటి చావే వారికి కూడా రావాలంటూ హీరో దర్శన్ పై రేణుక స్వామి తండ్రి శాపనార్ధాలు పెట్టాడు. తన కొడుకుని అంతలా హింసించి చంపడం పట్ల ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు.