తెలుగు రాష్ట్రాల్లో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయ్..! గత ఐదు రోజులుగా విజయవాడ విలయవాడగా మారగా.. ఖమ్మం కకావికలం అయ్యింది..! ఇప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో అని ఈ రెండు ఉమ్మడి జిల్లాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో.. మరీ ముఖ్యంగా కృష్ణలంక, సింగ్ నగర్ ప్రాంతాల్లో పర్యటిస్తూ తాను కోటి రూపాయలు విరాళంగా ప్రకటించడమే కాకుండా.. పార్టీ నేతలు, కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నారు.. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. వైసీపీ నేతలంతా ఇప్పుడు విజయవాడలోనే తిష్ట వేశారు. ఇప్పటికే ఒకసారి పర్యటించిన జగన్.. లండన్ టూర్ రద్దు చేసుకుని మరీ తాను కట్టిన రీటైనింగ్ వాల్ వల్లే ఇవాళ లక్షలాది మంది జనాలు ప్రాణాలతో ఉన్నారని చెప్పుకుంటున్నారు.
సారు ఏమైనట్టు..?
ఇక తెలంగాణ విషయానికొస్తే.. విజయవాడ కంటే ఖమ్మంలో దారుణంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ అధికారులు.. మరోవైపు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు రంగంలోకి దిగినప్పటికి ఇంకా సాధారణ స్థితికి రాలేదు. పదుల సంఖ్యలో వరదల్లో చిక్కుకొని.. కొట్టుకొని పోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దీంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బాధితుల తాలుకా వీడియోలు, ఫోటోలు చూస్తే హృదయ విదారకమే..! ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు. మీడియాలో కానీ.. సోషల్ మీడియాలో కనీసం ఒక్క చిన్నపాటి ప్రకటన కూడా లేకపోవడం గమనార్హం. ఇంతకీ సారు ఏమైనట్టు..? రాష్ట్రంలోనే ఉన్నారా..? అంటే ఖమ్మం ప్రజలు పడుతున్న బాధలు చూస్తున్నారా..? లేదా అనేది ఎవరికీ అర్థం కావట్లేదు.
ఏమైంది బాస్..?
ఒకసారి కాదు రెండు సార్లు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలు కష్టాల్లో కనీసం అటు వైపు తొంగి చూడకపోవడం ఎంత వరకు సమంజసం..? ప్రజల పడుతున్న ఇబ్బందులు బాసుకు పట్టవా..? ప్రజలు ఓడిస్తే ఇక వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా అక్కర్లేదా..? ఇదే ఇప్పుడు ఎక్కడ చూసినా నడుస్తున్న చర్చ.. అంతకు మించి రచ్చ. ఈ క్రమంలోనే కేసీఆర్ మిస్సింగ్.. కనబడుటలేదు అని హైదరాబాద్ మహా నగరంలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లలో రాసి ఉంది. ఎంతైనా రెండుసార్లు గెలిపించిన ప్రజలే కదా ఒకసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. తోచినంత వ్యక్తిగతంగా లేదా పార్టీ పరంగా విరాళం ఇస్తే బాగుంటుందేమో మరి. రేపు పొద్దున్న మళ్ళీ ఎన్నికలు వస్తాయ్.. అప్పుడు ఇదే ఖమ్మం ప్రజలను ఓట్లు అడగాల్సి వస్తుంది కదా మరి. ఇక సోషల్ మీడియాలో అంటారా కేసీఆర్ గురుంచి చెప్పనక్కర్లేదు.
అయ్య అటు.. కొడుకు ఇటు!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఖమ్మం ప్రజలకు తమవంతు సాయం చేసి.. బాధితులను పరామర్శించేందుకు మంగళవారం నాడు వచ్చిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పలువురు గులాబి పార్టీ నేతలను కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు దాడికి తెగబడ్డారు. దీంతో ప్రశాంతతకు మారుపేరు ఐనా ఖమ్మం కాస్త రణరంగంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ అక్కడికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. అని కారు పార్టీ కార్యకర్తలు చెబుతున్న మాటలు. మరోవైపు.. కేసీఆర్ ఫేం హౌస్ కు మాత్రమే ఇప్పటికీ పరిమితం కావడం.. కేటీఆర్ మాత్రం విదేశాల్లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తిట్టి పోస్తున్నారు. ఒక సోషల్ మీడియాలో ఐతే పొట్టు.. పొట్టు తిడుతున్న పరిస్థితి. ఇంత జరిగినా.. జరుగుతున్నా కేసీఆర్ మాత్రం ఎవరి కంటికీ కనిపించరు.. వినిపించరు..? ఎందుకో ఏంటో మరి..! జరిగింది ఏదో ఇప్పటి వరకూ జరిగిపోయింది ఇప్పటికైనా జనాల్లోకి వచ్చేయ్ బాస్.. సమయం ఆసన్నమైంది. ఇక షురూ చేస్తే క్యాడర్, నేతల్లో కాస్త ఊపు వస్తుంది.. లెట్స్ రాక్ కేసీఆర్..!