అధికారులు.. అధికారులు.. అధికారులు.. అంతా అధికారులదే తప్పు.. వాళ్లు సహకరించట్లేదు..! ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళంతే వైఎస్ జగన్ భక్తులు అని ముద్ర..! గల్లీల్లోని గ్రామ పంచాయతీలో పని చేసే వీఆర్వో మొదలుకుని ఐపీఎస్, ఐఏఎస్ అఖరికీ స్టేట్ సెక్రటేరియట్ లో పని చేసే ఉన్నతాధికారుల వరకూ ఇలానే ఉన్నారు..! ఇదీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పదే పదే చెబుతున్న మాట. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి మూడు నెలలు అయినా ఎందుకీ పరిస్థితి.. లోపం ఎక్కడుంది..? తప్పు ఎవరిది..?
అసలేం జరుగుతోంది..?
స్కూళ్ళలో పని చేసే చిన్న చిన్న అటెండర్లు మొదలుకుని సీఎంవోలో పని చేసే పెద్ద పెద్ద అధికారుల వరకూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలు దడుసుకుంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్దిగా టైంకు వచ్చామా.. పని చేశామా.. వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. తేడాలు వస్తే తాట తీస్తారంతే. అందుకే ఎవరు ఎక్సట్రాలు చేయకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతారు అంతే. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడినా సరే చెప్పిన పని చేసి వెళ్ళేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్యోగులతో పని చేయించడంలో చంద్రబాబును మించిన వాళ్ళు ఎవరూ లేరు.. రారు. అందుకే చంద్రబాబు అంటే అధికారులకు పీకలదాకా కోపం.. ఇదే ఆగ్రహంతో ఒకటి రెండు ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడించారు కూడా. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారులు వర్సెస్ చంద్రబాబుగా నడుస్తాయి. అలాంటిది 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తర్వాత అధికారులు ఎందుకో అస్సలు సహకరించలేదు అని స్వయంగా చంద్రబాబే చెబుతున్న పరిస్థితి.
ఎందుకు ఇలా..?
అధికారంలోకి వచ్చింది మొదలుకుని.. విజయవాడ విలయం వరకూ ఎక్కడ చూసినా అధికారులు.. అధికారులు.. అధికారుల విఫలమే అని చెబుతున్న పరిస్థితి. వరదల ధాటికి జనాలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే కనీసం సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు ఘోరాతి ఘోరంగా విఫలం అయ్యారన్నది ఇప్పుడు నడుస్తున్న చర్చ. టీడీపీలో చిన్న చిన్న లీడర్లు మొదలుకుని చంద్రబాబు వరకూ అందరి నోట ఇదే మాట. లేనిపోని ఆరోపణలు.. అంతకు మించి అవమానకరంగా మాటలు. ఓ వైపు.. అందరూ జగన్ భక్తులు అనే ముద్ర ఎంతవరకూ కరెక్ట్..? ఎవరైనా కాస్త అలసత్వం వహిస్తే చాలు వాళ్ళు వైసీపీ తొత్తులేనా..? ఇది ఎంతవరకు సమంజసం..?. ఇక అనుకూల మీడియాలో ఐపీఎస్.. ఐఏఎస్ అధికారులను వైఎస్ అంటూ చిత్ర విచిత్రాలుగా రాతలు. ఇవీ చాలవు అన్నట్టు పదుల సంఖ్యలో ఉన్నతాధికారులను పక్కన పెట్టేయడం.. పోస్టింగులు ఇవ్వక నానా తిప్పలు పెట్టడం ఇవన్నీ మనం టీవీలు, పేపర్లలో చూస్తూనే ఉన్నాం.
ఎవరు మాట ఎవరు వింటారు..?
అధికారులు ఎప్పుడూ ఉన్నతాధికారులు మాట వింటారా..? వినరా..? వినాల్సిందే కదా..! అలాంటిది ఆ ఉన్నతాధికారులు ప్రభుత్వంలో ఉండే నేతలు, ప్రజాప్రతినిధులు మాట వింటారా.. లేదా..? సచ్చినట్టు వినాల్సిందే కదా. ఒకవేళ వినకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. ఇదే పద్ధతి ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేదే..! ఇదేమీ కొత్త కాదు.. కదా.. వైసీపీ ఉన్నా.. టీడీపీ ఉన్నా ఇది షరా మామూలే. ఇప్పుడు చంద్రబాబు మాట అధికారులు ఎందుకు వినరు చెప్పండి..? అస్సలు వినట్లేదు.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి.. తమాషాగా ఉందా..? అనే పరిస్థితి వచ్చిందంటే.. అదే బెదిరించి మరీ పనులు చేపించుకోవాల్సిన అసలేం జరుగుతోంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇదీ కారణం అవ్వొచ్చుగా..!
చంద్రబాబు తొలిసారి సీఎం కాదు కదా.. మూడు సార్లు విజయవంతంగా ముగించుకొని నాలుగోసారి సీటులో కూర్చున్నారు కదా. అలాంటిది అధికారులతో ఎలా పని చేపించుకోవాలో తెలియకపోతే.. తొలిసారి సీఎం అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా అధికారాలను కంట్రోల్ చేశారు.. అసలు ఇది ఎలా సాధ్యం అయ్యింది..?. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లు అయినా అధికారులను దారిలోకి తెచ్చుకోకపోవడం ఏంటి..? పదే పదే ఎందుకు మీడియా ముఖంగా.. రివ్యూ మీటింగుల్లో ప్రతిసారీ చెప్పుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం ఏంటి..?. పోనీ ఇప్పుడు మీరు చెప్పినట్టు వినట్లేదు అంటున్నారు సరే.. ఇదివరకు ప్రభుత్వం చెప్పినట్టు విన్నారని ఇప్పుడు సో కాల్డ్ అధికారులను పక్కన పెట్టడం.. ఇబ్బందులకు గురి చేస్తున్నారు కదా.. ఇప్పుడు టీడీపీ కూటమి సర్కార్ చెప్పినట్టు వింటే (చేయకూడని పనుల విషయంలో) రేపు పొద్దున్న వేరే పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి..? అందుకే భక్త వైసీపీ, తొత్తు వైసీపీ.. భక్త టీడీపీ.. తొత్తు టీడీపీ అని కాకుండా అధికారులను.. అధికారులుగా చూసి పని చేపించుకోవడం మంచిది సుమీ.! ఇవన్నీ కాదు అధికారులకు ప్రభుత్వంతో వచ్చిన సమస్య ఏమిటి..? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు..? ఏ విషయంలో వాళ్ళు ఇంత అసంతృప్తితో ఉన్నారు..? అనేది వివరంగా తెలుసుకొని.. పరిష్కారం అయ్యే పరిస్థితులు ఉంటే ఆ సంగతి ఏదో చూస్తే బాగుంటుంది ఏమో ఒకసారి ఆలోచిస్తే మంచిది మరి.