ఆరు కోట్లు.. పవన్ కు దండం పెట్టాల్సిందే
అవును.. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ రియల్ హీరో అనిపించుకున్నారు..! వరద బాధితులకు నేనున్నాను అంటూ తనవంతు సాయం చేసి మనసున్నోడు అని అనిపించుకున్నారు..! గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరం టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏపీలోని ఉమ్మడి విజయవాడ విల విలాడగా, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం కకావికలం అయ్యింది. వరద బీభత్సానికి ఈ రెండు జిల్లాల జనాలు చిగురుటాకులా వణికిపోతున్నారు. సాయం చేయండి.. మహాప్రభో అని చేతులెత్తి దండం పెడుతున్న పరిస్థితి.
నేనున్నాననీ..!
వరద బాధితులకు ఆహాకారలు.. వారున్న పరిస్థితులు చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఏపీకి కోటి రూపాయలు ఇచ్చిన సేనాని.. తాజాగా తెలంగాణకు కోటి రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక విజయవాడ వరద బాధితులు, ముంపునకు గురైన పంచాయితీలకు నాలుగు కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈ విరాళం మొత్తం వరదతో తీవ్రంగా నష్టపోయిన గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు రూ.లక్ష చొప్పున 400 గ్రామాలకు వినియోగించనున్నారు. అంటే.. మొత్తం ఆరు కోట్ల రూపాయలు తన సొంత డబ్బే ప్రకటించారు పవన్. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విరాళాలతో డిప్యూటీ సీఎందే ఎక్కువ. తొలి స్థానం ఈయనదే. చూశారుగా.. ప్రజలు కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండలేక పోయిన పవన్ తనవంతు సాయం ప్రకటించారు. డిప్యూటీ సిఎంను సొంత పార్టీ నేతలే కాదు.. ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటున్నారు. దండాలయ్యా అని దండం పెడుతున్న పరిస్థితి.
రావాల్సిందే కానీ..!
వాస్తవానికి పవన్ నేరుగా వరద బాధితుల దగ్గరికి వెళ్లి పరిస్థితి కనుక్కొని.. పరామర్శించాలి అనుకున్నారు. అయితే ఆయన వస్తే సహాయక చర్యలకు అంతరాయం కలుగుతాయని అధికారులు చెప్పడంతో విరమించుకున్నారు. అందుకే.. ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న పరిస్థితులు, గ్రామాలలో తాగునీరు, ఆహారం సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను అదేశిస్తున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోలు, రాజకీయ ప్రముఖులు సైతం పెద్ద మనసుతో సాయం చేస్తూనే ఉన్నారు.
రేవంత్.. శభాష్!
హైదరాబాద్ మహానగరంలో హైడ్రా దెబ్బ ఎలా ఉందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేయడంతో ఒక్కసారిగా హైడ్రా పేరు మారుమోగింది. దీనిపై సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ మధ్యనే మెగా బ్రదర్ నాగబాబు కూడా రియాక్ట్ అయ్యి మెచ్చుకున్నారు కూడా. హైడ్రా పెట్టి రేవంత్ మంచి పనిచేశారని చెప్పుకొచ్చారు. అసలు అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని హైడ్రా లాంటివి కచ్చితంగా ఉండాలన్నారు. ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్చేయాలి అని.. మానవతా కోణంలో కూడా చూడాలని సూచించారు. మరో ప్రభుత్వం వచ్చినా అడ్డగోలుగా కట్టకుండా.. బ్యూరోక్రసీని కట్టుదిట్టం చేయాలన్నారు. తెలంగాణలో మరో ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదని పవన్ కళ్యాణ్ ధీమాగా చెప్పారు.