ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. అటు ఖమ్మం నుంచి ఏపీకి పారుతున్న బుడమేరు వాగు పొంగడంతో విజయవాడ నగరం మునిగిపోయింది. ఇటు తెలంగాణలోని ఖమ్మంపై మున్నేరు నది విరుచుకుపడటంతో ఆ నగరం నీట మునిగింది. ఖమ్మం, విజయవాడ వరదలతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. అక్కడి ప్రజలు ఆహారం కోసం అర్రులు చాచుతున్నారు. మరోపక్క ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టినా కొంతమందికి ఆ సాయం అందడం లేదు.
దానితో టాలీవుడ్ హీరోలు చాలామంది రెండు తెలుగు ప్రభుత్వాల సహాయం కోసం ముందడుగు వేశారు. ముందుగా యంగ్ టైగర్ రెండు ప్రభుత్వాల సహాయనిధికి కోటి భారీ విరాళం ప్రకటిస్తే, బాలయ్య, చిరు రెండు తెలుగు రాష్ట్రాల కోసం చెరో కోటి ప్రకటించారు. యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, త్రివిక్రమ్, అశ్వినీదత్.. ఇలా ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం విరాళాలు అందించడంలోపెద్ద మనసుని మరోసారి చాటుకున్నాడు. కాదు కాదు తన పెద్దమనసు ముందు ఎవరూ సాటిరారని చాటిచెప్పాడు. ప్రభాస్ ఏపీకి రూ.1 కోట్లు, తెలంగాణకు రూ.1 కోట్ల చొప్పున మొత్తం రూ.2 కోట్ల సాయాన్ని ప్రకటించాడు.
అంతేకాకుండా వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు భోజనంతో పాటు మంచినీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభాస్ ప్రకటించిన భారీ విరాళంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా ప్రజలకు సహాయసహకారాలు అందిస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.