ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు..? విజయవాడ వరదలతో విల విలాడుతుంటే ఏమయ్యారు..? అడ్రెస్స్ లేరేం..? గెలిచాక సేనాని ఎందుకు ఇలా తయారయ్యారు..? జనసేనానికి జనాలు పట్టారా.. వాళ్ల కష్టాలు అక్కర్లేదా..? ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ప్రశ్నలు సొంత పార్టీ నుంచి సోషల్ మీడియా, ప్రతిపక్షం వరకూ వచ్చాయి. వీటి అన్నిటికీ చెక్ పెడుతూ, విమర్శకులకూ గట్టిగా ఇచ్చి పడేస్తూ మీడియా ముందుకు వచ్చారు. ఎందుకు ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు..? అనే దానికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం రాత్రి హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి మీడియా మీట్ నిర్వహించారు.
ఊహించని విపత్తు!
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ఉమ్మడి కృష్ణా జిల్లా మరింతగా ఎఫెక్ట్ అయ్యింది. ప్రభుత్వం వచ్చిన మూడు నెలల‌్లో ఇలాంటి ఉవద్రవం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా
తెలంగాణ నుంచి వర్షాల వరద నీరు వచ్చింది. గత ప్రభుత్వం వారు ఏమీ చేయలేకపోయారు. అందువల్లే ఈ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ప్లడ్ కెనాల్స్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తాం. బుడమేరు వాగును గత ప్రభుత్వం విస్మరించింది. అన్నమయ్య ప్రాజెక్ట్ పరిస్థితి చూశాం. చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. విజయవాడపై ప్రత్యేక కోణంలో దృష్టి పెట్టాలి. ఇది ప్రకృతి విపత్తు. సహాయ పునరావాస కార్యక్రమాల కోసం 262 పంచాయతి రాజ్ టీంలను ఏర్పాటు జేశాం. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పవన్ కళ్యాణ్.
నా వంతుగా నేను..
వరదలతో 1 లక్షా 72 వేల హెక్టార్లు లో పంట దెబ్బతింది. 17,645 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నష్టపోయాయి.2,851 కిలో మీటర్లు ఆర్ అండ్ బి రోడ్లు దెబ్బతిన్నాయి. వరద తగ్గుముఖం పట్టింది.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బుధవారానికి ఐదు లక్షల క్యూసెక్కులు వరద నీరు వచ్చే అవకాశం వుంది. అతి తక్కువ సమయంలో ఎఫెక్టీవ్ గా పని చేశాం. మూడు పార్టీల వ్యక్తులు కలిసి సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలి. నా వంతుగా కోటి రూపాయలు సిఎం సహాయ నిధికి ఉడుతలా సాయంగా ఇస్తున్నాను. రాష్ట్ర హితవు కోరే ప్రతి వ్యక్తి ఇలాంటి సమయంలో సహాయ పడాలి. 80 కోట్ల రూపాయలు జిల్లాలకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఇలాంటి విపత్తులు రాకుండా ప్రతి సిటీకి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలి అని పవన్ చెప్పుకొచ్చారు.
అందుకే నేను రాలేదు..!
ఐఏఎస్ అధికారులంతా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. నేను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే, వరద సహాయక చర్యలపై ప్రభావితం చూపుతుందన్న అధికారుల సూచన మేరకు ఆగిపోవాల్సి వచ్చింది. మా శాఖలు పని చేస్తున్నాయి. వరద బాదితులకు నేను ఎక్కడి నుంచి అయినా ధైర్యం చెప్పవచ్చు. ప్రజలు ఆందోళన చెందవద్దు. పంచాయతీరాజ్ తరపున, రాష్ట్ర విపత్తు నివారణ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పరిస్థితులు తెలుసుకుంటున్నారు. అతి తక్కువ సమయంలో ఎంతో సమర్థవంతంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వం తరఫున సహాయక చర్యల్లో దాదాపు 188 బోట్లు, 5 హెలికాప్టర్లు, 283 మంది గజ ఈతగాళ్లు పాల్గొంటున్నారు. 3 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేశాం అని పవన్ మీడియా ముఖంగా వివరించారు.
ఫోన్ చేయండి..
అత్యవసర సహాయం కావలసిన వారు 112, లేదా 1070, 18004250101 నెంబర్లకు కాల్ చేయండి.. వెంటనే కంట్రోల్ రూం సిబ్బంది మీకు అందుబాటులో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. దాదాపు 80 కోట్ల అత్యవసర సాయాన్ని జిల్లాలకు విడుదల చేయడం జరిగింది. ప్రకృతి విపత్తుల సమయంలో నిందలు వేయడం కాకుండా, సహాయక చర్యల్లో పాల్గొనేలా ఉండాలి. రాష్ట్ర యంత్రాంగం మొత్తం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని పవన్ మీడియాకు తెలిపారు. చూశారుగా.. ఇన్నాళ్లూ పవన్ పై వచ్చిన విమర్శలకు ఒకే ఒక్క ప్రెస్ మీట్ ద్వారా గట్టిగా ఇచ్చి పడేసారు.