ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి.. నేనేంటో చూపిస్తాను..! తుఫాన్‌తో అయినా పోట్లాడుతా.. మేఘాలసేనతో కొట్లాడుతా..! వైసీపీని అధ:పాతాళానికి తొక్కి పడేస్తా..! ప్రజలకు ఏమేం కావాలో అన్నీ ఇచ్చి తీరుతాం.. సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తాం..! ఇలా ఒకటా రెండా ఎన్నో మాటలు.. అంతకుమించి సవాళ్లు, ఆరోపణలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బే మునుపటి ఛాయలు ఏమీ కనిపించట్లేదు.. అస్సలు వినిపించట్లేదు..! ఇంతకీ డిప్యూటీ సీఎంకు ఏమైంది..?
ఆ దూకుడు ఏమైనట్టు..?
పవన్ కల్యాణ్.. అధికారంలో లేనప్పుడు, ఎన్నికల ముందు వైసీపీపై చేసిన పోరాటం అంతా ఇంతా కాదు..! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెడలు వంచి ఉద్ధానం లాంటి ప్రాంతాలను సెట్ చేయించారంటే అంత ఆషామాషీ అస్సలు కానే కాదని జనసైనికులు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఒకటా రెండా ఎన్నో సమస్యలపై పోరాటం చేశారు. నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ పవన్ దూకుడు, ఆ మాట తీరును చూసిన విశ్లేషకులు అసలు సిసలైన ప్రతిపక్ష నేత సేనానీయే అంటూ కొనియాడిన సందర్భాలు కోకొల్లలు. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దూకుడు ఏమైనట్లు..? పవర్ స్టార్‌కు నిజమైన పవర్ వచ్చినా ఎందుకు ప్రతి విషయంలోనూ మిన్నకుండిపోతున్నారు.. నోరు మెదపట్లేదు ఎందుకనీ..? అనేది ఆ పార్టీ కార్యకర్తలు, వీరాభిమానులకే అర్థం కాని పరిస్థితి.
ఎందుకు.. ఏమైందీ..?
అధికారం లేనప్పుడు వారాంతం అయ్యేసరికి వాలిపోయే పవన్.. ఏపీ ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్ లేరు. పైగా మునుపటి దూకుడు ఎక్కడా కనిపించలేదు. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు, ఫార్మా ప్రమాదాలు, విద్యార్థుల మృతి, ఎన్నో ఫుడ్ పాయిజన్ ఘటనలు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టళ్లలో హిడెన్ కెమెరాలతో విద్యార్థునీల నానా అవస్థలు, తాజాగా వానలు, వరదలతో విజయవాడ విల విల్లాడుతోంది. ఇలా ఒకటా రెండా ఆంధ్రాలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయ్. ఇన్ని జరుగుతున్నా పవన్ మాత్రం ఏమయ్యారో అభిమానులకే అర్థం కావట్లేదు. పోనీ.. సేనానికి ఏమైనా ప్రభుత్వంలో ప్రియారిటీ ఏమైనా తగ్గిందా..? అంటే అదీ లేదు. ఏపీలో ఏం జరిగినా సరే పవన్‌ను ట్యాగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది. అయినా సరే పవన్ మౌనవ్రతంలోనే ఎందుకున్నారో.. ఏంటో పైనున్న పెరుమాళ్లకే ఎరుక.