తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వానలకు జనజీవనం స్తంభించింది. ఎక్కడికక్కడ చెరువులు, వాగులు పొంగిపోర్లుతుండటంతో రెండు మూడు రోజులుగా కొన్ని గ్రామాలు జలదిగ్భంధంలో ఉండిపోయాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా సహాయక చర్యలు అందించే క్రమంలో అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైనంతమేరకు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో సినిమా వాళ్లు కూడా మేమున్నామంటూ ముందుకొస్తుండటం అభినందించదగ్గ పరిణామం.
ఇప్పుడే కాదు.. ఎప్పుడూ ఏ ప్రళయం సంభవించినా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. సహాయం చేయడానికి సినిమా ఇండస్ట్రీ ముందుంటుందనే విషయం తెలియంది కాదు. ఇప్పుడు కూడా సెలబ్రిటీలు తమ గొప్ప మనసును చాటుకుంటూ.. రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాలను అందజేస్తున్నారు. ఇందులో వైజయంతీ మూవీస్ సంస్థ ఏపీ ముఖ్యమంత్రి నిధికి రూ. 25 లక్షలు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఆయ్ టీమ్ కూడా ఇకపై వచ్చే కలెక్షన్లలో 25శాతం జనసేన పార్టీ ఆధ్వర్యంలో విరాళం ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ. 50 lakhs విరాళంగా ప్రకటిస్తున్నాను.. అని తారక్ ట్వీట్ చేశారు.
అలాగే మాస్ కా దాస్ విశ్వక్సేన్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరొక రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. ఇంకా సెలబ్రిటీలు సాధ్యమైనంత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు.