హైడ్రా.. ఈ పేరు వింటే పేదోడి నుంచి పెద్దోడి వరకూ బెంబేలెత్తిపోతున్నారు..! అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెడుతున్నాయ్..! కబ్జాదారులకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నారు ఏవీ రంగనాథ్..! తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చెరువులు, కాలువలు ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి భరతం పడుతోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే వందల సంఖ్యలో బిల్డింగులు కూల్చేసిన అధికారులు.. రెండు వందలకుపైగా ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నాన్ స్టాప్‌గా హైడ్రా బుల్డోజర్లు పరిగెడుతూనే ఉన్నాయి. త్వరలోనే లోటస్‌పాండ్‌కు వెళ్తాయని వార్తలు వస్తున్నాయి.
ఎందుకు.. ఏమైంది..?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేయడంతో హైడ్రాకు ఒక్కసారిగా ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. అయితే.. హైడ్రా ఖాతాలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన లోటస్ పాండ్‌లోని ఇల్లు కూడా ఉందన్నది నాలుగైదు రోజులుగా అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. లోటస్ పాండ్ చెరువు శిఖంలో ఇంటిని నిర్మించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అవునా.. నిజమేనా..?
హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు ఎవరి ఇంటి మీదికెళ్తాయో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్‌కు నోటీసులు ఇచ్చారని వార్తలొస్తున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో అసలు నిజమెంత..? నిజంగానే కూల్చేస్తారా..? అంటూ హైడ్రా కమిషనర్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో రంగనాథ్ స్పందిస్తూ.. వైఎస్ జగన్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చిందన్న వార్త అక్షరాలా అబద్ధం అని తేల్చిచెప్పారు. జగన్ లోటస్‌పాండ్ FTL పరిధిలోనే ఉందన్న విషయం అవాస్తవమని కొట్టిపడేశారు. జగన్‌కు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. సోషల్ మీడియలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారామని.. దానిని ఎవరూ నమ్మొదని విజ్ఞప్తి చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.