జనసేన పార్టీలో నంబర్ 2, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు రాజ్యసభ ఎంపీ కాబోతున్నారా..? అంటే నిజమే అనిపిస్తోంది. వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుల రాజీనామాలతో రెండు స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రానుంది. ఖాళీ అయ్యింది రెండు స్థానాలను తెలుగుదేశం, జనసేన చేరొకటి పంచుకోనున్నాయా..? అంటే రెండు పార్టీల నుంచి వస్తున్న సమాచారం, సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం రండి..!
ఇదీ అసలు సంగతి!
జనసేన ఆవిర్భావం నుంచి గెలుపు ఓటములు లెక్క చేయకుండా పార్టీని బలోపేతం చేయడంలో.. జీరోకు పరిమితం ఐనా లెక్కచేయకుండా, విమర్శకులు, ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్ ఇవ్వడంలో ముందుండి నడిపించిన వ్యక్తి నాగబాబు. అంతే కాదు 2024 ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేయగా.. పార్టీని గెలిపించడంలో, 100 శాతం స్ట్రైక్ రేటు రావడంలో కీలక పాత్ర పోషించారు మెగా బ్రదర్. దీనికి ఫలితం పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, పలు కీలక శాఖలు దక్కించుకున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ.. బ్రదర్ నాగబాబుకు మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి పదవి దక్కలేదు..! ఐతే ఇప్పుడు అన్నకు కీలక పదవి, అత్యున్నత హోదా కల్పించడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
నిజమేనా..!?
పార్టీలో పెద్ద తలకాయ, నంబర్ 2 ఐనప్పటికీ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లు అయినా ఎలాంటి పదవి ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా పెద్దగా ఇష్టపడేవారు కాదేమో..! ఎందుకంటే అది ఆయన రేంజికి సరిపోదేమో అన్నది జనసేన కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయమట. అందుకే.. ఈ విషయం తెలుసుకున్న పవన్ తన సోదరుడికి సముచిత స్థానం కల్పించాలని భావించారట. అందుకే పెద్దల సభకు పంపి.. తగిన ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయిన రెండు స్థానాలను టీడీపీ, జనసేన పంచుకుంటాయని తెలుస్తోంది. ఆ ఒక్కరు నాగబాబు అని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రేపు పొద్దున్న ఛాన్స్ ఉంటే మినిస్టర్ కూడా అవుతారట. ఎంపీ అయ్యాక పార్టీ వ్యవహారాలు, పనులన్నీ నాగబాబు చక్కబెడతారని సమాచారం.
నాడు.. నేడు..!
అంటే.. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక.. రాజ్యసభ ఎంపీ, ఆ తరవాత కేంద్ర మంత్రి అయ్యారు.. ఇప్పుడు బ్రదర్ నాగబాబు కూడా అలానే కాబోతున్నారు అన్న మాట. ఎంతైనా ఢిల్లీలో ఉంటే.. అక్కడి నుంచి పాలిటిక్స్ చేస్తే కిక్కే వేరు..! ఇక టీడీపీ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఎంపీ కాబోతున్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి పరిస్థితుల రీత్యా పార్టీకి దూరంగా.. పోటీ చేయడానికి సాహసించలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి మళ్ళీ యాక్టివ్ కావాలని గల్లా చూస్తున్నారట. ఇందులో నిజానిజాలు ఎంతో తెలియాలంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకూ వేచి చూడాలి మరి.