ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898AD సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ప్రభాస్ కెరీర్‌లో మరో రూ. 1000 కోట్ల ప్లస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమా సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. నాగ్ అశ్విన్ సెకండ్ పార్ట్‌ని ఎలా డీల్ చేస్తాడనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్‌లో ఇంకొందరు స్టార్స్ యాడ్ అవుతారనేలా టాక్ వినబడుతోంది. మరీ ముఖ్యంగా కృష్ణుడి పాత్రపై కల్కి 2898AD విడుదలైనప్పటి నుండి ఒకటే వార్తలు.
కల్కి 2898AD లో కృష్ణుడి పాత్రకు తమిళ నటుడిని తీసుకున్న నాగ్ అశ్విన్.. ఫేస్‌ని మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. దీంతో రెండో పార్ట్‌లో కృష్ణుడి ఫేస్ చూపించాల్సి వస్తే.. ఆ పాత్రకు మహేష్ బాబు లేదా నానిని తీసుకుంటే బాగుంటుంది అంటూ ఓ రేంజ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మొదటి పార్ట్‌లో కృష్ణుడి పాత్రధారిని చూసిన వారంతా.. నాని అయితే బాగుండేది అనేలా అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. పార్ట్1లో కృష్ణుడి పాత్ర కేవలం ఓ రెండు, మూడు నిమిషాల పాత్రగానే ఉన్నా.. సీక్వెల్‌లో మాత్రం ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటుందని.. అంతా భావిస్తున్నారు. అందుకే, ఆ పాత్రకి తెలుగు నటుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇక ఇదే విషయాన్ని నానిని తన తాజా ఇంటర్వ్యూలో అడగగా.. ఆయన ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు.
అసలు ఛాన్సే లేదు.. కల్కి రెండో భాగంలో కృష్ణుడి పాత్ర కంటే అర్జునుడు, కర్ణుడి పాత్రలే కీలకమని, ఈ సీక్వెల్‌లో కూడా కృష్ణుడి ముఖాన్ని చూపించమని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అసలు నేను సీక్వెల్‌లో ఉన్నట్లుగా ఎవరు పుట్టించారో తెలియదు. బహుశా నేను ఆ టీమ్‌తో కలిసి ఎక్కువసార్లు కనిపించాను కదా.. అందుకు అంతా అలా అనుకుని ఉండొచ్చు. కల్కిలో అతిథి పాత్ర గురించి నేను ఇప్పటి వరకు ఎవరితో చర్చించలేదు. కానీ ఆ టీమ్‌తో కలిసి పని చేసేందుకు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.