శత్రువులను కొని తెచ్చికుంటున్న రేవంత్!
అవును.. కష్టం అనేది మనదాకా వస్తే గానీ ఆ బాధ ఏంటో తెలియదు అంటారు కదా.. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి అలానే ఉందట..! కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా తెలంగాణ సర్కార్‌కు ఇక్కట్లు వచ్చిపడ్డాయ్..! హైడ్రాతో ఎక్కడలేని తలనొప్పులు వస్తున్నాయన్నది కొందరు సర్కారు దగ్గరగా ఉన్న వ్యక్తులు చెబుతున్న మాట. ఇది అక్రమార్కుల కోసం తెచ్చిందే.. చెరువులు, కాలువలు ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి భరతం పట్టాల్సిందే.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు కానీ అనవసరం శత్రువులను సీఎం కొని తెచ్చుకుంటున్నారన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా సొంత పార్టీలో నడుస్తున్న పెద్ద చర్చ.
అటు తిరిగి.. ఇటు తిరిగి!
హైడ్రా తెచ్చింది మంచి పనుల కోసమే అయినప్పటికీ అటు తిరిగి.. ఇటు తిరిగి రేవంత్ కుటుంబ సభ్యుల దగ్గర వచ్చి ఆగింది. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. టైమ్ ఇస్తే ఇంట్లో సామాను తీసుకొని బయటికి వెళ్తానని చెబుతున్న పరిస్థితి. ఇంట్లో మనిషి, సీఎం దెబ్బకు ఒకింత తిరుతి రెడ్డి నొచ్చుకున్నారట. ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రేవంత్ వ్యవహారం కోడై కూస్తోందట. ఎప్పుడు ఎవరి ఇంటి మీదికి బుల్డోజర్లు వచ్చి పడతాయో అర్థం కాని పరిస్థితట. ఇలా ఒకటా రెండా ఇంటా బయటా అన్ని రంగాల ప్రముఖులందరికీ రేవంత్ శత్రువులాగా మారుతున్నారనే మాటలు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి.
ఇదేంటి..?
హైడ్రా బుల్డోజర్లు ఇప్పటి వరకూ హిందువుల ఇళ్లపై మాత్రమే వాలుతున్నాయి కానీ.. మజిస్ల్ నేతలు, ఇతర వర్గాల వారి మీదికి ఎందుకు వెళ్లట్లేదని బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఓవైసీ బ్రదర్స్‌కు చెందిన కాలేజీ, ఆస్పత్రులు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు కదా.. ఎందుకు వాటిని పట్టించుకోలేదు..? ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల బడాబాబుల నిర్మాణాల ఇక్కడ బఫర్ జోన్‌లోనే ఉన్నాయ్ కదా వాటి సంగతేంటి..? ఇప్పుడు రేవంత్ కేబినెట్‌లో ఉన్న మంత్రుల ఫామ్ హౌస్‌ల గురించి ఆధారాలతో సహా బయటపెడితే ఎందుకు పట్టించుకోవట్లేదు..? మరోవైపు.. హైడ్రాలోనూ అవినీతి జరుగుతోందని, అధికారులు డబ్బులు తీసుకుని ఆక్రమణలు పట్టించుకోలేదని.. చెరువుల రూపు రేఖలు మార్చే పనిలోనూ అధికారులు ఉన్నారనే చర్చలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. చూశారుగా.. ఎక్కడో మొదలైన హైడ్రా ఎటు నుంచి ఎటు వెళ్తోందో..? ఏమో రేపొద్దున్న ఏమైనా జరగొచ్చు.. జరగరానిది జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!