వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు కన్నెర్రజేస్తున్నారు..! మరోవైపు కార్యకర్తలు, వీరాభిమానులు, సోషల్ మీడియా వేదికగా తిట్టిన తిట్టు తిట్టకుండా కడిగిపడేస్తున్నారు..! బాబోయ్.. వీళ్లంతా అభిమానం ఎక్కువై తిడుతున్నారా..? లేకుంటే ఇన్నాళ్లు జరిగినదంతా మనసులో పెట్టుకుని దుమ్మెత్తి పోస్తున్నారా..? అనే సందేహాలు వస్తున్న పరిస్థితి. పార్టీలో గత కొన్నిరోజులుగా నెలకొన్న పరిణామాలపై ట్విట్టర్‌లో డిబెట్లు పెట్టి మరీ ఆటాడుకుంటున్నారు..! ఇకనైనా జగన్‌కు సిగ్గొస్తుందా..? అని కొందరు అంటుంటే.. అబ్బే అసలు సిగ్గనేది ఉంటే కదా..? అని మరికొందరు మాట్లాడుకుంటున్న పరిస్థితి.
ఏం జరిగింది..?
వైఎస్ జగన్.. నా అనుకున్న వాళ్లను, నమ్మకంగా ఉన్న నేతలను, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడేవారిని.. కుటుంబానికి దగ్గరగా ఉండేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోరన్నది జగమెరిగిన సత్యమే..! అలా ఎంతో మంది కార్యకర్తలు, నేతలయ్యారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పెద్ద పెద్ద పదవులే అనుభవించారు. నాడు వైఎస్ అంతే.. నేడు వైఎస్ జగన్ కూడా సేమ్ టూ సేమ్..! అయితే ఇందులో జగన్‌కు రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్లు కూడా ఉన్నారు.. అంతకుమించి అత్యంత నమ్మకస్తులు, నమ్మినబంట్లూ ఉన్నారు. వైఎస్ మరణాంతరం జగన్ వెంట నడిచి వైసీపీ ఆవిర్భావం నుంచి నిన్న, మొన్నటి వరకూ అండగా ఉన్నోళ్లూ ఉన్నారు. అయితే.. జగన్‌లో ఏమైనా తేడా వచ్చిందో లేకుంటే అధికారం పోయే సరికి అబ్బే ఇక వైసీపీ ఎందుకబ్బా..? అని వెళ్లిపోతున్నారో తెలియట్లేదు కానీ ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడు ఎవరు రాజీనామా చేస్తానని ప్రకటిస్తారో ఏంటో అర్థం కాని పరిస్థితిలో వైసీపీ ఉంది. అవునా.. ఫలానా వ్యక్తి రాజీనామా చేశారా.. చేస్తున్నారా..? అని ముక్కున వేలేసుకునే పరిస్థితి.
అవసరమా..?
నా అనుకున్నోళ్లను నెత్తికెక్కించుకున్న వైఎస్ జగన్‌ను అదే నెత్తిమీదెక్కి తొక్కి మరీ వైసీపీని వీడుతున్నారు..! నాడు ఆళ్ల నాని.. నేడు మోపిదేవి వెంకటరమణ ఇలా ఒకరా ఇద్దరూ చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పేర్లే ఉన్నాయి. పోనీ.. ఇప్పుడు బీద మస్తాన్ గురించి చెప్పుకుంటే నాడు వైసీపీ అధికారంలో ఉంది గనుక పుట్టి పెరిగిన టీడీపీని వదిలేసి మరీ పార్టీలో చేరారంటే అర్థమేంటి..? ఆయన బిజినెస్‌లు, స్కూళ్లు, కాలేజీలను కాపాడుకోవటానికే కదా..? ఆ మాత్రం తెలియకుండా గుడ్డెద్దులాగా ఉంటే ఎలా..? ఇప్పుడు అధికారంలో టీడీపీ కూటమి ఉంది గనుక మళ్లీ యథావిధిగా సొంత గూటికి వెళ్లిపోతున్నారా..? అసలు ఇలాంటి వాళ్లు అవసరమా అంటూ కార్యకర్తలు, నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. అవన్నీ అటుంచితే మోపిదేవి లాంటి వ్యక్తి వైసీపీని వీడుతున్నారంటే ఏదో పెద్ద తేడానే కొడుతోందనే చర్చ కూడా పెద్ద ఎత్తునే నడుస్తోంది. రేపో మాపో రాజ్యసభ ఖాళీ.. ఆ తర్వాత లోక్‌సభ.. అనంతరం శాసనసభ ఖాళీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..! ఆఖరికి ఆ నలుగురు అన్నట్లుగా ఆ ఒక్కడు, ఒకే ఒక్కడుగా వైఎస్ జగన్ మిగిలినా అందులో వింతేమీ ఉండదేమో..! ఇంత జరుగుతున్నా.. ఇంతకుమించే జరిగినా అధినేతలో ఇసుమంత అయినా మార్పు ఉంటుందేమో చూడాలి మరి.