ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఏ క్షణాన ఘోర ఓటమిని చవి చూసిందో.. ఆ మరుసటి రోజు నుంచే ఒక్కొక్కరుగా పార్టీని వీడటం మొదలుపెట్టారు. పదుల సంఖ్యలో నేతలు ఇప్పటికే వైసీపీని వీడగా.. తాజాగా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు, రైట్ హ్యాండుగా ఉన్న ఆత్మీయులు, రాజ్యసభ సభ్యులు.. ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఏం జరుగుతుందో ఏంటో అని క్యాడర్ భయపడిపోతున్న పరిస్థితి.
ఎందుకో.. ఏమో..!
2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ పార్టీ హౌస్ ఫుల్ అయ్యింది. ఒక్కటే చేరికలతో ఇక చాలు బాబోయ్ అని ఒకానొక సందర్భంలో ఆఫీస్ తలుపులు మూసేశారు. పార్టీలో చేరిన దాదాపు అందరికీ ఏదో ఒక పదవి ఇస్తూ తగిన ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ అంతా ఓకే కానీ.. 2024 ఎన్నికల్లో అలా వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో లేదో ఇలా వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్న పరిస్థితి. వద్దు మున్ముందు మంచి రోజులు ఉన్నాయ్.. అర్థం చేస్కోండి అని బతిమలాడుతున్నా వినిపించుకోకుండానే వద్దు బాబోయ్.. నీకు, నీ పార్టీకి దండం అని రెండు చేతులు ఎత్తి నమస్కరించి తిరిగి చూడకుండా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు.
ఒకరా ఇద్దరా.. ఎందరో..!
వైసీపీ ఓటమి తర్వాత రావెల కిషోర్ బాబుతో మొదలైన రాజీనామాలు గోదావరి జిల్లాలు, రాయలసీమ జిల్లాలను చుట్టుకొస్తున్నాయ్. తీరా ఇప్పుడు గుంటూరు, విజయవాడ వైసీపీలో రాజీనామాలు నడుస్తున్నాయి. ఒకేరోజు ముగ్గురు ముఖ్యనేతలు, అందులోనూ కీలక పదవి ఉన్నవారే వారంతా..! ఇందులో ఒకరు వైఎస్ జగన్ అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడు. రాజ్యసభ సభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామాకు సిద్ధం అవ్వగా.. ఇతనితో పాటు మరో వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూడా రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి అని తెలియవచ్చింది. ఆఖరికి పోతుల సునీత కూడా వైసీపీకి రాజీనామా చేయడం, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. టీడీపీ నుంచే వైసీపీలోకి వచ్చిన పోతుల.. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశం ఉంది. చూశారుగా ఓకే రోజు ఎన్ని వికెట్లు పడ్డాయో.. రేపో మాపో ఇంకెన్ని వికెట్లు పడతాయో.. ఉన్న క్రికెట్ టీమ్ చివరికి ఏమవుద్దో చూడాలి మరి.