జగన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గుడ్ బై!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత నమ్మకస్తుడు, రైట్ హ్యాండ్ మోపిదేవి వెంకటరమణ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా..? ఇక అన్న లేదు.. అన్నకు తమ్ముడు లేదు అని .. అసలు వైసీపీనే వద్దని టాటా చెప్పేస్తున్నారా..? అంటే సొంత పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఇంతకీ ఈయన పార్టీని వద్దనుకోవడానికి కారణాలేంటి..? ఇంత నమ్మకంగా మోపిదేవి ఎందుకిలా చేస్తున్నారు..? అనేది తెలియక అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట.
ఎవరీ మోపిదేవి..?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు అంటారు కదా..! ఇది చాలా సందర్భాల్లో అక్షరాలా నిజమైంది. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన మోపిదేవి.. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తుడు. అలా వైఎస్ ఫ్యామిలీకి దగ్గరైన ఆయన.. మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో తన మంత్రివర్గంలోకి కూడా తీసుకున్న వైఎస్.. ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. వైఎస్ మరణానంతరం.. కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎక్సైజ్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారు. నాటి కాంగ్రెస్ జగన్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టినా సరే.. మోపిదేవి వెన్నంటే ఉన్నారు. వైసీపీ స్థాపించిన తర్వాత పార్టీలో చేరి కీలక పాత్ర పోషించారు. అంతేకాదు జగన్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినా కూడా ఆయన వెంటే ఉన్నారు. .... ఉన్న మోపిదేవికి వైసీపీలో మంచి పొజిషన్ ఇస్తూ వచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయనకు.. ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేశారు జగన్. ఆ తర్వాత మోపిదేవీతో మంత్రిగా రాజీనామా చేయించిన జగన్.. 2020లో రాజ్యసభ సభ్యుడిని చేసి పెద్దల సభకు పంపించారు. ఇప్పుడూ ఎంపీగానే ఉన్నారు.
ఎందుకిలా..?
ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ లోలోపల ఏం జరిగింది..? ఎందుకు జగన్ రెడ్డితో మోపిదేవికి మనస్పర్థలు ఏం వచ్చాయో.. తెలియట్లేదు కానీ వైసీపీకి రాజీనామా చేసి.. అధినేతతో కటీఫ్ చెప్పేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. తెలుగుదేశంలో చేరడానికి సర్వం సిద్ధం చేసుకున్నారని వైసీపీ కార్యకర్తలు కొందరు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న పరిస్థితి. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారని సొంత పార్టీ వాళ్ళే రచ్చ రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో విలువల్లేవ్.. వంకాయలు అంటూ లేవు అని మోపిదేవిని చూసిన తర్వాత అర్థం అయ్యింది అంటూ టిట్టేస్తున్నారు. రాజ్యసభకు ఇంకో సంవత్సరం 6 నెలలు మాత్రమే సమయం ఉందని.. ఇక వైసీపీకి గడ్డు రోజులే అని తన అనుయాయులకు చెప్పిన మోపిదేవి ఇక పార్టీకి గుడ్ బై చెప్పేయబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఇంతకు మించి దారుణాతి దారుణం మరొకటి ఉండదని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. జగన్ అన్నకు నేనున్నానంటూ నమ్మించాడు మరి ఇప్పుడు? ఏంది పరిస్థితి. మరోవైపు.. మోపిదేవి అస్సలు పార్టీ వీడే పరిస్థితి లేదని ఇదంతా పచ్చి అపద్దం అని.. పనిగట్టుకుని కొందరు ఇలా రూమర్స్ సృష్టిస్తున్నారు అని మరికొందరు వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏంటో తెలియాలంటే మరికొన్ని గంటలు.. రోజులు వేచి చూడక తప్పదు మరి.