దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా..? రాదా..? అనే నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఒకటా రెండా.. మార్చి 15 నుంచి ఆగస్టు-27 వరకూ ఒక్కటే ఎదురుచూపులు.. ఇవాళ్టికి ఫలించాయి. కవితకు దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేసింది. ఈ శుభపరిణామంతో బీఆర్ఎస్ శ్రేణుల ఆనందానికి హద్దుల్లేవు. బతుకమ్మ పండుగ ముందే వచ్చిందంటూ గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు, సుప్రీంకోర్టులో ఎన్నిసార్లు కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారో.. ఎన్నిసార్లు తిరస్కరణకు గురయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తీరా చూస్తే.. సుప్రీంకోర్టులో భారీ ఊరటే దక్కిందని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్లు చెరలో ఉన్న కవిత.. చెరసాల నుంచి విడుదల కాబోతున్నారు.
ప్రశ్నల వర్షం!
ఒకటిన్నర గంటపాటు అటు ఈడీ తరఫున.. ఇటు కవిత తరఫున లాయర్లు మధ్య వాడీవేడిగా వాదనలు జరిగాయి. మధ్యలో కలుగుజేసుకున్న సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం.. కన్నెర్రజేయడం ఇవన్నీ జరిగాయి. అరెస్ట్ మొదలుకుని పిటిషన్ల వరకూ నెలకొన్న అన్ని విషయాలు సుప్రీం విచారణలో ప్రస్తావనకు వచ్చాయి. బెయిల్ అవసరమే లేదని ఈడీ తరఫు లాయర్ ఎస్వీ రాజు వాదించగా.. కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వరు..? ఇంత మందికి బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా కవితకు బెయిల్ మంజూరు చేయడానికి ఏం అడ్డొచ్చింది..? ఏ విషయంలో ఇవ్వరో చెప్పాలని ఇలా వాదోపవాదాలు గట్టిగానే జరిగాయి. మరోవైపు ఫోన్ డేటా డెలీట్, ఫార్మాట్ చేయడంపైనా రచ్చ రచ్చే జరిగింది.
ఫోన్ పే రచ్చ!
ఫోన్‌లోని మెసేజ్‌లను సాధారణంగా అందరూ తొలగిస్తారని.. ఫోన్‌లోని మెసేజ్‌లను తరచూ తానూ తొలగిస్తానని.. ఫోన్‌కు వచ్చే సందేశాలను తొలగిస్తే తప్పేంటని స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పడంతో విచారణలోనే కవిత రిలీఫ్ దక్కినట్లయ్యింది. మెసేజ్‌లను కాదు.. పూర్తిగా డేటాను ఫార్మాట్ చేశారని.. ఈడీ నోటీస్ రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తరపు లాయర్లు చెప్పడంతో ఒకింత మళ్లీ వివాదం రాజుకుంది. దీనికి కవిత తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ బదులిస్తూ.. ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తూ ఉంటారు.. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లకు కూడా కవిత అప్పగించారన్నారు. ఏంటీ.. ప్రతిరోజు ఫోన్లు మారుస్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా వాదోపవాదాలు జరిగిన తర్వాత చివరికి కవితకు అయితే బెయిల్ వచ్చింది.. బీఆర్ఎస్ శ్రేణులకు ముందుగానే బతుకమ్మ పండుగొచ్చేసినట్లు అయ్యింది.