టాలీవుడ్ ఇండస్ట్రీ ఎటు పోతుంది.. ఇప్పుడు చాలామందిలో మదిలో మెదిలే ప్రశ్న ఇది. కేవలం స్టార్ హీరోల సినిమాలకే మీడియా సపోర్ట్ ఉంటుందా.. చిన్న సినిమాలను మీడియా పట్టించుకోదా.. మీడియా మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా చిన్న సినిమాలను అస్సలు పట్టించుకోవడం లేదు. చిన్న సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండడమే లేదు.
మీడియా కూడా చిన్న సినిమాల పబ్లిసిటీ విషయంలో చాలా లైట్ గా ఉంటుంది. చిన్న సినిమాలకు హిట్ టాక్ వచ్చినా థియేటర్స్ కి ప్రేక్షకులు కదలట్లేదు. అయితే దీని మొత్తానికి కారణం ఓటీటీనే అనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆడియన్స్ స్టార్ హీరోల సినిమాలకు మాత్రం థియేటర్స్ కి కదులుతున్నారు. అది కూడా అభిమానుల చేసే రచ్చ చూసి అంతో ఇంతో ఇంట్రస్ట్ ఉంటుంది.
టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టేటస్ మైంటైన్ చేస్తున్న ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అలాగే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ సినిమాలకే క్రేజ్ ఉంటుంది. మీడియం హీరోలైన నాని, విజయ్ దేవరకొండ ఇలా కొద్దిమంది హీరోల సినిమాలకు ప్రేక్షకాదరణ, మీడియా సపోర్ట్ ఉంటుంది. కానీ చిన్న సినిమాల విషయంలో ఆ రెండు కనిపించడం లేదు.
కల్కి సినిమా విషయమే తీసుకోండి, ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉన్న ఊపు ప్రేక్షకుల్లో కనబడలేదు, కారణం ఒక్కటే.. అదే నెల తిరిగేసరికి ఓటీటీకి వచ్చే సినిమాలకు ఎందుకు తొందరపడి థియేటర్స్ కి పోవడం అనేది వారి ఆలోచన. మరి దర్శకనిర్మాతలు ఓటీటీలను కట్టడి చేస్తే థియేటర్స్ కి మనుగడ ఉంటుంది అని మాట్లాడుకోవడమే కానీ.. అందుకు సంబందించిన చర్యలేవి తీసుకున్న పాపాన పోవడం లేదు.