కోమటిరెడ్డిని ఓడిస్తా.. తీన్మార్ శపథం!
అవును.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొట్లాటలు మళ్లీ మొదలయ్యాయి..! అప్పుడెప్పుడో సీఎం పదవి కోసం, ఆ తర్వాత ఎమ్మెల్సీ టికెట్ల కోసం జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు..! ఆ తర్వాత హామీలు అమలు, రుణమాఫీ, హైడ్రా వ్యవహారంతోనే ప్రశాంతంగా పార్టీ ఉందనుకుంటున్న టైమ్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రచ్చ రచ్చ చేశారు. ఏకంగా మంత్రి, అదీ సీనియర్, అందులోనూ కట్టర్ కాంగ్రెస్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇదివరకు ఈ ఇద్దరి మధ్య ఉన్న పాత గొడవలు ఏమున్నాయో తెలియట్లేదు కానీ ఒక్కసారిగా, అదీ బహిరంగ సభలో విరుచుకుపడ్డారు తీన్మార్.. అంతేకాదు రానున్న ఎన్నికల్లో ఎట్టా గెలుస్తావో చూద్దాం అంటూ పెద్ద పెద్ద శపథాలే చేసిన పరిస్థితి.
ఏమైందో.. ఏమో..!
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. కాంగ్రెస్ పార్టీలో బాగా అసంతృప్తితోనే రగిలిపోతున్నట్లుగా ఆయన మాటలను బట్టి చూస్తే స్పష్టం అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తీన్మార్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన్ను ఓడించడానికి కోమటిరెడ్డి పనిచేశారన్నది ప్రధాన ఆరోపణ. అదీ ఎన్నికలు అయిపోయిన ఇన్నిరోజులుకు ఈ వ్యవహారం బయటికి రావడం గమనార్హం. దీంతో.. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని దగ్గరుండి నేనే ఓడగొడ్తా.. నా ఎమ్మెల్సీ కౌంటింగ్ రోజు కోమటిరెడ్డి విదేశాల నుంచి రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా..? అని అడిగాడు.. గుర్తుపెట్టుకోండి వీళ్లకు మిత్తి, అసలు, చక్రవడ్డీతో సహా చెల్లించి ఒక్కరిని కూడా గెల్వనియ్యను అంటూ నవీన్ శపథం చేశారు.
రియాక్షన్ ఏంటో..!
కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రేంజ్ వేరు.. కాస్త అటు ఇటు అయ్యుంటే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి..! అలాంటిది పోయి పోయి వెంకట్ రెడ్డితోనే తీన్మార్ పెట్టుకున్నారు.. రేపొద్దు్న్న పరిస్థితి ఏంటనేది మల్లన్నకే తెలియాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రి వీరాభిమానులు, అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆయన సీరియస్‌గా తీసుకుంటే చింతపండు కథేంటి..? అన్నది ప్రశ్నార్థకమే అని పార్టీలోనే కొందరు చర్చించుకుంటున్నారు.. సోషల్ మీడియాలోనూ పెద్ద రచ్చే జరుగుతోంది. ఇందులో నిజానిజాలేంటి అనేది తెలుసుకోకుండా కోమటిరెడ్డిపై ఇలాంటి ఆరోపణలు, వార్నింగ్‌లు ఇవ్వడమేంటి..? అనేది మల్లన్నకే తెలియాలి. పోనీ.. నిజమే అయితే నేరుగా మంత్రినే అడగొచ్చు.. కొట్లాడొచ్చు.. అసలు కథేంటో తేల్చుకోవచ్చు కానీ ఇలా బహిరంగంగా బయటపడితే అటు ఆయన.. ఇటు ఈయన పరువు గంగలో కలవదా..? జర చూసుకోవాలిగా మల్లన్న బ్రో..!