టీడీపీ యంగ్ ఎమ్మెల్యే వెర్రి చేష్టలు!
ఆయనొక పేరున్న పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీకి చెందిన వ్కక్తి..! ఆయన తండ్రికి పేరు ప్రఖ్యాతలు బాగానే ఉన్నాయ్..! అలాంటప్పుడు ఆ పేరును నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేయాలి కానీ.. పిల్ల చేష్టలు, వెర్రి పనులతో నలుగురిలో పలుచన అయితే ప్రయోజనమేంటి..? అది కూడా ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..! ఒకసారి కాదు రెండు సార్లు ఎన్నికల్లో ఆఖరికి గెలిచి నిలిచాడు..! టీడీపీ తరఫున గెలవడం.. అటు అధికారంలోకి రెండూ అయ్యాయి.. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆచి తూచి పదవి కాపాడుకుంటూ ఓట్లేసి గెలిచిన ప్రజలకు నాలుగు మంచి పనులు చేయాలే తప్ప.. అనవసరంగా అడ్డంగా బుక్కయితే ఎలా..!
అవసరమా బాసూ..!
అసలే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల నోరు జారుడు వ్యవహరంతో రచ్చ రచ్చే అవుతోంది..! ఇలాంటప్పుడు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని వ్యవహరించాల్సిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రెచ్చిపోయారు. అది కూడా ఏ ప్రత్యర్థో అయితే అబ్బే ఎవరూ పట్టించుకునే వారు కాదేమో. ఏకంగా మీడియాపైన అదీ ఈనాడు, ఈటీవీపైన కావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం చాలా సీరియస్ అయ్యింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలోని కొంతమంది రాజకీయ నేతలు ట్రాక్టర్ ఇసుకకు రూ.500 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఈనాడులో వార్త వచ్చింది. దీంతో బొజ్జల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నేరుగా ఈనాడు ప్రతినిధికే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిపడేశారు. మళ్లీ ఇలాంటి వార్తలు వచ్చినా.. వ్యతిరేక కథనాలు రాసినా తాట తీస్తా.. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటూ విరుచుకుపడ్డారు. అప్పటి వరకూ ఓ ఎత్తయితే ఇలా వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని కూడా అటు పేపర్‌లో ఇటు ఈటీవీలో రావడంతో మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది. దీంతో హైకమాండ్ దాకా విషయం పోవడం.. ఇంకోసారి ఇలా చేస్తే బాగోదని వివరణ తీసుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయట.
జాగ్రత్తగా ఉండాల్సిందే..!
యంగ్ ఎమ్మెల్యేకు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ అన్నది ఎప్పుడో నిరూపితమైందని సొంత పార్టీ నేతలు తిట్టిపోసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే.. ఎన్నికల ముందు వలంటీర్లను ఉగ్రవాదులతో పోలుస్తూ మాట్లాడిన మాటలు అసలుకే ఎసరు తెచ్చిపెట్టాయి. ఈ కామెంట్స్‌ను కవర్ చేయడానికి కూటమి నేతలు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆఖరికి ఏదో ఒకలా మేనేజ్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా మీడియాతోనే.. అదీ టీడీపీకి అనుకూల మీడియాతో పెట్టుకోవడం ఏంటి..? ఇది నిజంగా వెర్రి కాకపోతే మరేంటో చెప్పండని తెలుగు తమ్ముళ్లే తలలు పట్టుకుంటున్న పరిస్థితి. నాడే సుధీర్‌కు కళ్లెం వేసి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు కదా అని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారంటే.. కచ్చితంగా నయానో భయానో చెప్పుకుని వార్నింగ్‌లు హైకమాండ్ నుంచి వెళ్లాల్సిందే మరి.