తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణలపై హైడ్రా ఝులిపిస్తున్న రేవంత్ సర్కార్.. రామోజీ ఫిల్మ్ సిటీని టచ్ చేస్తుందా..? ఇప్పుడిదే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. చెరువులు, నదులు, ఆక్రమించిన అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాల్సిందే.. ఇందులో మారు మాట కూడా లేదు..! ఇప్పుడు హైడ్రా అనేది అందరికీ వర్తిస్తుందా..? లేకుంటే కొందరికేనా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. చెరువులను ఆక్రమించి చేసిన నిర్మాణాలు నగరం నడిబొడ్డున మొదలుకుని చుట్టుపక్కలా లెక్కలేనన్ని ఉన్నాయి. N కన్వెన్షన్‌ను నేలమట్టం చేసిన తర్వాత ఒక్కొక్కటిగా శాటిలైట్ చిత్రాలతో, పాత రికార్డులతో సహా సామాన్య ప్రజలు, నెటిజన్లు బయటపెడుతున్న పరిస్థితి. ఇందులో ఎక్కువగా వినిపిస్తున్నవి రెండే రెండు. అందులో ఒకటి.. గండిపేట చెరువులో టీడీపీ ట్రస్ట్ నిర్మించిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్.. మరొకటి భాగ్యనగరానికి బయట ఉన్న రామోజీ ఫిల్మ్ సిటి.
అయ్యే పనేనా..!
భగవద్గీత స్పూర్తితోనే హైదరాబాద్‌లోని చెరువుల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. ఓకే మంచిదే ఇప్పటివరకూ చేశారు.. ఇకపైనా ఇలా చేసినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ.. అదే చేత్తో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ సంగతి కూడా చూడరాదే అన్న.. భగవద్గీత అందరికీ ఒకటే కదా..? అందరికీ వర్తించినట్లే హైడ్రా అందరికీ వర్తించాలి కదా..? అనే డిమాండ్ సామాన్య ప్రజల నుంచి బయటికి చెప్పుకోలేని, కక్కలేక మింగలేక ఉన్న సెలబ్రిటీల వరకూ వస్తున్న పరిస్థితి. వాస్తవానికి.. ఫిల్మ్ సిటీ అనేది ఇప్పటిది కాదు ఎన్టీఆర్, నారా చంద్రబాబుల హయాంలో నిర్మించినది. నాడు ఫిల్మ్ సిటీ కోసం భూముల కోసం అడగ్గా ఎన్టీఆర్-రామోజీరావుల మధ్య పెద్ద గొడవ జరిగిందనే ప్రచారం ఉంది. ఇక్కడే ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తి అది కాస్త అన్నగారి అధికారం పోయేంతవరకూ వచ్చి.. చంద్రబాబును సీఎం చేసే పరిస్థితికి తెచ్చిందని అంటుంటారు. బాబు సీఎం అయ్యాక రామోజీ కలల ఫిల్మ్ సిటీకి లైన్ క్లియర్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అందుకే.. రామోజీ పట్ల సీబీఎన్ చాలా కృతజ్ఞుడిగా ఉంటారన్నది అతిపెద్ద ఆరోపణ.
లేక్ సిటీ కాస్త..!
వేలాది ఎకరాల్లో ఉన్న చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించే ఫిల్మ్ సిటీ నిర్మించారనే ఆరోపణ అయితే ఎప్పట్నుంచో ఉంది. అక్కడున్న చెరువుల సముదాయాన్ని లేక్ సిటీగా నగరవాసులు పిలుస్తుండేవారట. ఇది ఎవరు కాదన్నా అవునన్నా జగమెరిగిన సత్యమే. ఫిల్మ్ సిటీ లెక్క కూడా తేల్చితే బాగుంటుందని.. లెక్కలు తీయాల్సిందేనని డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. దీనికి తోడు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో రాయపోల్, పోల్కంపల్లి, నాగన్‌పల్లి, ముకునూరు గ్రామాలకు చెందిన 576 మందికి రామోజీ ఫిల్మ్ సిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ.. అక్కడికి పోనివ్వకుండా ఫిల్మ్ సిటీ యాజమాన్యం అడ్డుకుంటోందని కమ్యూనిస్టు పార్టీలు ధర్నాలు చేయని రోజులే లేవు. సో.. రీల్ లైఫ్‌లో నాగార్జున కన్వెన్షన్‌ను కూలగొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రియల్ హీరో అనిపించుకోవాలన్నా.. జనాల్లో మరింత నమ్మకం కలగాలన్నా.. రెండో దఫా సీఎం కావాలన్నా కచ్చితంగా ఫిల్మ్ సిటీని టచ్ చేసి తీరాల్సిందేనని సొంత పార్టీ నేతలు మొదలుకుని కార్యకర్తలు, ప్రముఖుల నుంచి కూడా సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో.. రేవంత్ స్టెప్ ముందుకేస్తారా లేదా అనేది చూడాలి మరి.